గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్ల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా దురదృష్టకరం. ఈ తీర్పు రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి గొప్ప విలువలకు తూట్లు పొడిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండడమే కాకుండా, కోట్లాది మంది దళిత క్రిస్టియన్ల జీవితాలను ఈ తీర్పు ప్రమాదంలో పడేయబోతున్నది. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అప్పీల్‌కు వెళ్లి ఈ రాజ్యాంగ వ్యతిరేక తీర్పును రద్దు చేయించాలి.
1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం సృష్టించింది. దళిత (మాదిగ) వర్గానికి చెందిన తాగునీటి చెరువులో ఆధిపత్య (కమ్మ) సామాజికవర్గానికి చెందిన యువకులు పశువులకు స్నానం చేయించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు, మాపైనే ఎదురుతిరిగి మాట్లాడుతారా అనే అహంకారంతో దాడికి పాల్పడ్డారు. ఆరుగురు మాదిగలను హత్య చేశారు. ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షిని విషాహారం పెట్టి చంపారు. ఈ హత్యాకాండనే దేశంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రావడానికి పునాది అయింది. అయితే ఈ మారణకాండలో మృతులు తెల్లా మోషే, తెల్లా ముత్తయ్య, తెల్లా యెహోషువా, సాక్షి దుడ్డు అలీసమ్మ క్రైస్తవ మతాన్నే ఆచరించారు. వారిని చంపినందుకే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం ప్రకారమే సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుల వరకు తీర్పులు వెలువరించాయి.
1991 ఆగస్టు 6న చుండూరులో జరిగిన హత్యాకాండలో 8 మంది దళిత (మాల) యువకులు మరణించారు. అందులో జాలాది ఇమ్మాన్యుయేల్, జాలాది ఇసాకు, సంకురు సామ్సన్ కూడా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నవారే. ఈ కేసులో 2007లో చుండూరులోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ప్రత్యేక కోర్టు 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.
అనంతరం 2014లో హైకోర్టు ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టివేస్తే, ఇప్పటికీ ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నది. ఈ కేసు సుప్రీం కోర్టులో ఇంకా ఎందుకు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నది అని ఊహించడం అంత కష్టమేమీ కాదు. సుప్రీంకోర్టు అదే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ కేసులో గతంలో ఇచ్చిన తీర్పును, చట్టాలను ఎలా విస్మరించింది? ఆనాడు బాధితులు అనుసరిస్తున్న మతంతో సంబంధం లేకుండా, కేవలం కులం ఆధారంగానే కేసులు నమోదు చేసి తీర్పులు ఇచ్చి, ఇప్పుడు మతానికి రిజర్వేషన్లు, రక్షణ చట్టాలను ఎలా అంటకడుతారు?
కులం వేరు-మతం వేరు
భారతీయ సమాజంలో కుల వివక్ష ఒక లోతైన సామాజిక వ్యాధి. ఇది కేవలం మతపరమైన నమ్మకం కాదు, పుట్టుకతో వచ్చే ఒక సామాజిక ముద్ర. క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే కులపరమైన వేధింపులు, సామాజిక వెలివేతలు మటుమాయం అవుతాయా? అస్పృశ్యత అనే కళంకం బాప్టిజం నీటితో కడిగివేసినట్టు అవుతుందా?
శాసన చరిత్ర – సామాజిక సత్యం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వుల్లోని క్లాజ్ 3 చరిత్రను పరిశీలించడం చాలా అవసరం. 1950లో ఈ ఉత్తర్వును మొదటిసారి అమలు చేసినప్పుడు, క్లాజ్ 3 ప్రకారం కేవలం హిందూ మతాన్ని అనుసరించే వారికి మాత్రమే ఎస్సీ హోదా పరిమితమై ఉండేది. ఆ తర్వాత 1956లో దీనిని సవరించి సిక్కు మతస్థులను చేర్చారు. 1990లో మరోసారి సవరణ చేస్తూ బౌద్ధ మతస్థులకు కూడా ఈ హోదాను వర్తింపజేశారు. అయితే, ఇన్ని దశాబ్దాల్లో ఎన్ని సవరణలు జరిగినప్పటికీ క్రైస్తవ మతాన్ని మాత్రం ఈ ఉత్తర్వుల్లో చేర్చకపోవడం గమనార్హం.
ఇదే ప్రాతిపదికన, క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని కోర్టు స్పష్టంచేసింది. కానీ ఇక్కడ ఒక సామాజిక సత్యం దాగి ఉన్నది. కులం మతపరమైన గుర్తింపు కాదు, అది ఒక వారసత్వ సామాజిక నిర్మాణం. ఒక వ్యక్తి తన ఆత్మగౌరవం కోసం మతం మారవచ్చు, కానీ సమాజం అతడిని చూసే కోణం మారడం లేదు. ఈ కేసులో నిందితులు బాధితుడిని కేవలం క్రైస్తవుడిగా చూసి దాడి చేయలేదు; వారు అతడిని ఒక నిర్దిష్ట కులానికి (మాదిగ) చెందిన వ్యక్తిగా గుర్తించి, కులపరమైన దూషణలతో దాడికి పాల్పడ్డారు. అంటే, హింసకు ప్రేరణ కుల వివక్షే అయినప్పుడు, బాధితుడి వ్యక్తిగత విశ్వాసం రక్షణకు అడ్డుగోడగా మారడం ఎంతవరకు న్యాయం? వేధింపులకు గురిచేసేవారికి స్పష్టంగా కనిపిస్తున్న కులం, రక్షించాల్సిన చట్టానికి ఎందుకు కనిపించడం లేదు?
సాక్ష్యాధారాల్లో వైరుధ్యం
సుప్రీంకోర్టు తీర్పులో న్యాయస్థానం అనుసరించిన తీరు అనేక విరుద్ధమైన అంశాలతో కూడి ఉన్నది. ఒక వ్యక్తి మళ్లీ హిందూ మతంలోకి మారినప్పుడు, ఆ మార్పు ‘నిజాయితీతో కూడుకున్నదా’ అని నిర్ధారించడానికి కఠినమైన సాక్ష్యాధారాలను కోర్టు కోరుతున్నది. కానీ, ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి మారినప్పుడు మాత్రం ఎటువంటి లోతైన విచారణ లేదా అనుభవపూర్వక ఆధారాలు లేకుండానే అతడి కుల హోదా రద్దయిపోయిందని భావిస్తున్నది. ఇది ఒకరకమైన అనుభవపూర్వక అంధత్వం. మతం మారిన వెంటనే శతాబ్దాల నాటి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం మాయమైపోతుందని భావించడం వాస్తవ దూరమైన ఆలోచన. అంతేకాకుండా, బాధితుడి వద్ద చట్టబద్ధంగా పొందిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ, అది అతడికి ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదని కోర్టు పేర్కొనడం ఆశ్చర్యకరం.
ఆర్టికల్ 17 విస్మరణ
సుప్రీంకోర్టు తీర్పులోని అత్యంత విచారకరమైన అంశం ఏమిటంటే.. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణం గురించి మౌనం వహించడం. అస్పృశ్యత నివారణను ఆర్టికల్ 17 ఎటువంటి షరతులు లేకుండా ప్రకటిస్తుంది. బాధితుడి మతం ఏదైనా సరే, ఏ రూపంలోనైనా అస్పృశ్యతను పాటించడం నేరమని ఇది స్పష్టం చేస్తున్నది. అస్పృశ్యత కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దళిత క్రైస్తవులు నేటికీ గ్రామాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వంటి నివేదికలు నిరూపించాయి.
సంక్షేమం వేరు.. రక్షణ వేరు
రిజర్వేషన్లు లేదా ఇతర సంక్షేమ ఫలాలు పొందేందుకు అర్హతను నిర్ణయించే 1950 ఉత్తర్వులను, ఒక నేరానికి సంబంధించిన రక్షణ కల్పించే ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి ముడిపెట్టడం తర్కబద్ధం కాదు. రిజర్వేషన్లు సామాజిక అభివృద్ధికి సంబంధించినవి. కానీ అట్రాసిటీ చట్టం ప్రాణ రక్షణకు, ఆత్మగౌరవానికి సంబంధించినది. చట్టం రక్షణ కవచం బాధితుడి మతాన్ని బట్టి కాకుండా, నేరస్థుడి ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించాలి. హిందూ దళితుడిపై దాడి జరిగితే అట్రాసిటీ కేసు నమోదై, క్రైస్తవ దళితుడిపై దాడి జరిగితే సామాన్య నేరంగా పరిగణించడం సమానత్వానికే విరుద్ధం.
న్యాయాన్ని నీరుగార్చిన కొట్టివేత
అట్రాసిటీ చట్టం సాంకేతిక కారణాల వల్ల వర్తించదు అనుకున్నా, కనీసం భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింద నమోదైన కేసులనైనా విచారించాల్సింది. బాధితుడికి గాయాలు జరిగినట్టు వైద్య ధృవీకరణ పత్రాలు ఉన్నా, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నా.. విచారణకు ముందే కేసును కొట్టివేయడం విస్మయానికి గురిచేస్తున్నది. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్ (1992) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, ఒక కేసు విచారణకు అర్హత లేనంత బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే కొట్టివేయాలి. కానీ ఈ కేసులో తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న వైరుధ్యాలను సాకుగా చూపి నీరుగార్చడం వల్ల బాధితుడికి న్యాయం పొందే ప్రాథమిక హక్కును నిరాకరించినట్టే.
చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఒక వ్యక్తి తన విశ్వాసాలను మార్చుకున్నందుకు, అతడు ఎదుర్కొనే కుల వివక్షకు చట్టపరమైన రక్షణ లేకుండా పోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. రాజ్యాంగంలోని 17వ అధికరణం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉన్నది.
కులం ఒక సామాజిక కట్టుబాటు; అది మతం మారినంత మాత్రాన చనిపోదు. ఒకవైపు సాక్ష్యాలను కోరుతూ, మరోవైపు ఉన్న సాక్ష్యాలను తిరస్కరిస్తూ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దళిత క్రైస్తవులను సామాజికంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉన్నది. కులం అనే మాయని మచ్చ ఉన్నంత వరకు, దానికి వ్యతిరేకంగా ఉన్న చట్టం మతం పేరుతో వెనక్కి తగ్గకూడదు. ఈ సమస్య పరిష్కారానికి రాజ్యాంగ ధర్మాసనం ద్వారా సమీక్ష జరగడం లేదా పార్లమెంట్ తగిన సవరణలు చేయడం తక్షణావశ్యం. రాజ్యాంగం లోపల ఉన్న రక్షణలు బాధితుడికి భరోసానివ్వాలి కానీ, సాంకేతికతలతో నేరస్థుడికి దారి చూపకూడదు. అప్పుడే రాజ్యాంగం పట్ల సామాన్యుడికి నమ్మకం, గౌరవం మిగులుతాయి. న్యాయం కేవలం అక్షరాల్లోనే కాదు, ఆచరణలో కూడా అందరికీ సమానంగా అందాలి. ఆ దిశగా అడుగులు పడటమే నేటి సామాజిక ఆవశ్యకత.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 వ్యక్తి తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇచ్చిందని సుప్రీంకోర్టుకు తెలియదా? క్రైస్తవంలోకి మారి చర్చికి వెళ్లినంత మాత్రాన వివక్ష ఉండదు, అవమానం ఉండదు, అంటరానితనం ఉండదు అని నిరూపించే శాస్త్రీయబద్ధమైన పరిశోధనలు లేదా కొలమానాలు ఏవైనా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నదా? క్రైస్తవ మతం పుచ్చుకున్నంత మాత్రాన అడ్డగూడూర్‌లో మాల సామాజిక వర్గానికి చెందిన మరియమ్మ మీద లాకప్‌లో చిత్రహింసలు ఆగాయా? నిజానికి అ కేసులో ఫిర్యాదుదారు చర్చి ఫాదర్ బాలశౌరి దళితేతరుడు. ఇప్పటికీ ఎంతో మంది ఆధిపత్య వర్గాలకు చెందిన వారు తమ కులాలకు చెందిన పేర్లనే నేటికీ వాడుకొంటున్నారు. మతం మారి నా వెంటనే కులం, కుల వివక్ష పోవు అని భారతదేశంలో ఎన్నో ఘటనలు నిరూపిస్తున్నాయి.
కమిటీల రిపోర్టులు ఏం చెప్తున్నాయి?
భారత ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ, తన నివేదికలో దళితులు మతం మారినా వారి సామాజిక స్థితి, అంటరానితనం, వివక్ష మారలేదని స్పష్టం చేసింది. అనంతరం 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ తమ నివేదికలో దళితులు క్రైస్తవ లేదా ఇస్లాం మతానికి మారినా, వారిపై ఉండే వివక్ష, అవమానం మాత్రం మారలేదని, సామాజిక స్థితి మెరుగుపడలేదని స్పష్టంచేసింది. మతం మారిన దళితులకు ఎస్సీ హోదానే ఇవ్వాలని తమ నివేదికలో పొందుపరిచింది. కానీ ఆనాటి యూపీఏ ప్రభుత్వం కమిటీ నివేదికను అమలుపరచలేదు. ఇదే విషయంపై అధ్యయనం కోసం 2022లో ఎన్డీఏ ప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిషన్ నేటికీ నివేదిక సమర్పించలేదు.
తక్షణ కర్తవ్యం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ నివేదికను వెంటనే తీసుకోవాలి. కమిటీ సిఫారసులను బహిర్గతపరచాలి. సుప్రీంకోర్టుకు దళిత క్రైస్తవుల వాస్తవ పరిస్థితులను నివేదించాలి. సుప్రీంతీర్పును సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలి. తీర్పు అమలు కాకుండా చట్టబద్ధంగా నిలువరించాలి. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచకుండా సూచనలు, ఆదేశాలు జారీ చేయాలి. అంతవరకు యథాతథ స్థితిని కొనసాగించాలి.
-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్