2025 ఆగస్టు 14న స్టాండర్డ్ అండ్ ప్యూర్ (ఎస్ అండ్ పీ) గ్లోబల్ రేటింగ్స్ భారత సార్వభౌమాధికార క్రెడిట్ రేటింగ్‌ను ‘బీబీబీ (మైనస్)’ నుంచి ‘బీబీబీ’కి పెంచింది. తద్వారా 18 ఏండ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో అత్యల్ప స్థాయిలో ఉన్న రేటింగ్‌కు ముగింపు పలికినట్టు అయ్యింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ రేటింగ్ సవరణ ఆర్థిక రంగంతోపాటు పాలకులకు ఆనందాన్ని కలిగించింది. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు ఈ అప్‌గ్రేడ్‌ను దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. కానీ, అనుమానాస్పదమైన అంకెలు, సందేహాస్పదమైన డేటా, నెరవేరని సామాజిక-ఆర్థిక వాగ్దానాల నీడలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులను గత కొన్నేండ్లుగా గమనిస్తున్న నాలాంటి ఫైనాన్షియల్ జర్నలిస్టు, కార్పొరేట్ న్యాయవాదికి రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ఆచితూచి స్పందించాల్సిన సందర్భం ఇది.
భారత క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ అవ్వడం కేవలం ఒక సంకేతం కాదు. గ్లోబల్ ఇన్వెస్టర్లు, రుణదాతల్లో భారత పబ్లిక్ ఫైనాన్స్, క్రెడిట్ విశ్వసనీయత గణనీయంగా మెరుగుపడిందనడానికి నిదర్శనం. భారత కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో చౌకగా నిధులను పొందవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరిగే అవకాశం ఉంది. రూపాయి, సావరిన్ బాండ్లు విశ్వసనీయతను సంతరించుకుంటాయి. విదేశీ రుణ ఖర్చులు తగ్గుతాయి. మన ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించడంతో భారత్ వాణిజ్య రంగంలో సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో బలమైన క్రెడిట్ రేటింగ్ ఉండటం ఎంతో కీలకం.
ఎస్ అండ్ పీ తాజా రేటింగ్ అనేది బలమైన స్థూల ఆర్థిక మౌలిక అంశాలు, మెరుగైన ద్రవ్య విశ్వసనీయత, స్థిరమైన ఆర్థిక ఏకీకరణలపై ఆధారపడింది. భారత రుణ-జీడీపీ నిష్పత్తి ప్రస్తుతమున్న 83 శాతం నుంచి 2029 ఆర్థిక సంవత్సరం నాటికి 78 శాతానికి తగ్గుతుందని ఈ ఏజెన్సీ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం వచ్చే మూడేండ్ల సగటు జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతం ఉండవచ్చని భావిస్తున్నది. కరోనా మహమ్మారి తర్వాత పునరుద్ధరణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులతో ఈ వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, ఈ వెలుగుజిలుగుల శీర్షికల నడుమ భారత ఆర్థిక పథం సంక్లిష్టంగా ఉన్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, బీజేపీ పాలనలో అధికారిక డేటా రిపోర్టింగ్, విధాన ఫలితాలపై మొదటినుంచీ వివాదాలున్నాయి. స్వతంత్ర పరిశీలకులు, ఆర్థిక నిపుణులు డేటా సమగ్రతను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారత ఆర్థిక శాఖ మాజీ సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ అనేక ఆరోపణలు చేశారు. 2012 తర్వాత జీడీపీ వృద్ధి గణాంక విధానంలో సర్దుబాట్ల వల్ల 2-2.5 శాతం అధికంగా అంచనా వేశారని ఆయన అంటున్నారు. జీడీపీ సగటు వృద్ధిరేటు 7 శాతమని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ, ఇతర అంచనాలు మాత్రం అది 5 శాతం ఉండొచ్చని సూచిస్తున్నాయి. ఇది విధానాలు, రాజకీయాలపై పర్యవసానాలను కలిగి ఉంటుంది.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ప్రధాని మోదీ పదే పదే చెప్పే వాగ్దానం నేరవేరలేదు. లీక్ అయిన 2017-18 నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు 6.1 శాతం. ఇది గత 45 ఏండ్లలో అత్యధికం. ఈ నివేదిక విడుదలను ఆలస్యం చేస్తూ, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)ను హైలైట్ చేయాలని ప్రభుత్వం చూసింది. కానీ, అర్బన్, యువతలో నిరుద్యోగంపై అంచనాలను చాలా తక్కువ చేసి చూపడం కొనసాగుతున్నదని విమర్శకులు అంటున్నారు. 2011-12 నుంచి 2018 మధ్యకాలంలో 1.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరంతరం ఉద్యోగాల సృష్టి కోసం అత్యధిక డిమాండ్ ఉండే, అధిక జనాభా ఉన్న ఈ దేశంలో ఇది పెద్ద ఎదురుదెబ్బ.
దేశంలో తయారీ రంగంలోని పరిశ్రమలను ప్రోత్సహించడానికి, ఎగుమతులను పెంచడానికి ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం ‘మేక్ ఇన్ ఇండియా’. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ, 2014లో జీడీపీలో 15 శాతం ఉన్న తయారీరంగం వాటా 2022 నాటికి 13 శాతానికి పడిపోయింది. అదే సమయంలో దీర్ఘకాల ఉద్యోగాల సృష్టి లేదా ఎగుమతుల్లో పురోగతి సాధించినట్టు స్పష్టమైన ఆధారాలు లేవు. అందుకు బదులుగా సేవల రంగం, అనధికారిక ఆర్థిక వ్యవస్థ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇటీవలి సంక్షోభ సమయంలో ఈ
బలహీనత బయటపడింది.
దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిందని నీతిఆయోగ్ చెప్తున్నది. కానీ, వరల్డ్ బ్యాంక్, ఆక్స్‌ఫామ్ వంటి స్వతంత్ర సంస్థల అంచనాలు భిన్నంగా ఉన్నాయి. భారత్‌లో పేదరికం 1215 శాతానికి దగ్గరగా ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. అయితే ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 1 శాతం మంది వద్ద జాతీయ సంపదలో 40 శాతం పోగుబడింది. ఇది 2014లో ఉన్న 22 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. అసమానతలో గణనీయమైన పెరుగుదలను ఇది సూచిస్తున్నది. ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా సంపద పెరుగుదల ఫలితాలు సామాన్యులకు చేరలేదు. భారత వృద్ధి దృశ్యం నుంచి అనేక వర్గాలు మినహాయించబడ్డాయి.
ఎస్ అండ్ పీ రేటింగ్ అప్‌గ్రేడ్ అనేది భారత ఆర్థిక క్రమశిక్షణ, లోటు నియంత్రణ, ద్రవ్య విజ్ఞతపై ఆధారపడి ఉంది. మహమ్మారి అనంతరం ఉద్దీపనల వల్ల ఆర్థిక లోటు 2020-21లో ఉన్న 9.3 శాతం నుంచి 202526 నాటికి 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. ద్రవ్య లోటు తగ్గింపు కోసం ప్రభుత్వం సులభమైన, సరళమైన విధానాన్ని ఎంచుకున్నది. మూలధన వ్యయాన్ని 201415లో 1.6 శాతం నుంచి 202526లో 3 శాతానికిపైగా పెంచింది. అదే సమయంలో సంక్షేమం, మౌలిక రంగంలో వయాన్ని బలోపేతం చేస్తున్నది.
అయితే, శీర్షికల్లో మాత్రమే కనిపించే పురోగతి ఈ అంకెల గారడీని దాచిపెడుతుందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. బడ్జెట్ వెలుపల రుణాలు, బడ్జెట్ పరిధికి మించిన సబ్సిడీలు, నామమాత్రపు జీడీపీ అంచనాలు.. వాస్తవ రుణాలు, లోటు స్థాయిలను మరుగునపరిచాయని చెప్పవచ్చు. 202425 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం 9.4 శాతం పెరిగినప్పటికీ, అందుకు తగ్గట్టుగా వసూళ్లు మాత్రం లక్ష్యాలను చేరుకోలేదు.
దేశ స్థూల ప్రభుత్వ రుణాలు 2020లో జీడీపీలో 88 శాతం ఉండగా, ఇప్పుడు 82 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ ఆందోళనకరమైన పరిస్థితి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ కోసం దేశీయ రుణాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతున్నది. వడ్డీ వ్యయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం-జీడీపీ నిష్పత్తి అత్యల్పంగా ఉండటం భారతదేశం భవిష్యత్తులో ఆర్థికపరమైన ప్రమాదాలకు గురిచేస్తుంది. ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, డిజిటలైజేషన్, లేబర్ కోడ్లు వంటి సంస్కరణ ప్రయత్నాలు జరిగాయి.
కానీ, నెమ్మదిగా అమలు చేయడం, బ్యూరోక్రాటిక్ ప్రతిబంధకాలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల కొన్నిసార్లు అడ్డంకులు ఎదురయ్యాయి. వృద్ధిని క్రమశిక్షణతో సమతుల్యం చేస్తూ ఆర్థిక బలోపేతానికి భారతదేశం కట్టుబడి ఉందని 2025-26 బడ్జెట్ స్పష్టం చేసింది. అయితే, దీన్ని కొనసాగించేందుకు ఆదాయ స్థాయులు, ఉత్పాదకత వేగంగా వృద్ధి చెందాలి. అదే సమయంలో మూలధన వ్యయం గణనీయంగా పెరగాలి. ఎస్ అండ్ పీ చూపించిన నమ్మకానికి విధానంలో స్థిరత్వం, మౌలిక రంగంలో పెట్టుబడులే ఆధారం. కానీ, ఈ అభివృద్ధి ఫలితాలు అన్ని వర్గాలకు కాకుండా, కొన్ని వర్గాలకే కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2014 నుంచి బీజేపీ అధికారంపై పూర్తి పట్టు సాధించడంతో ఆర్థిక నిర్వహణలో కేంద్రీకృత విధానం ఏర్పడింది. కానీ, దీని వల్ల డేటా స్వతంత్రత క్షీణిస్తుందని విపక్ష నేతలు, ఆర్థికవేత్తలు, మాజీ బ్యూరోక్రాట్లు సహా విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు తమకు ప్రతికూలంగా ఉన్న సూచీలను అణచివేయడం వంటి చర్యలు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్‌లో రాజీనామాలకు దారితీసింది. అంతేకాదు, రాజకీయ లబ్ధి కోసం గణాంకాల మాయాజాలం పావుగా మారుతున్నదనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
పారదర్శకత ఒక వివాదాస్పద అంశంగా మారింది. విశ్వసనీయ ఆర్థిక నిర్వహణ అంటే గణాంక సంస్థలను బలోపేతం చేయడం, స్పష్టమైన పద్ధతులు, స్వతంత్ర ఆడిట్లు, నిజాయితీతో కూడిన రిపోర్టింగ్ ఉండేలా చూడటం. డేటా సమగ్రతపై నెలకొన్న వివాదాలు ఎస్ అండ్ పీ చూపిన విశ్వాసంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. అంకెలు స్వయం ప్రేరేపిత అంచనాలను కాదు, వాస్తవ పురోగతిని ప్రతిబింబించాలి.
కార్పొరేట్ ఇండియా, ప్రపంచ ఇన్వెస్టర్లకు ఈ రేటింగ్ అప్‌గ్రేడ్ సులభసాధ్యత, తమకు పెట్టుబడి వ్యయాలను, ఎఫ్‌డీఐలపై ధీమాలను సమకూరుస్తుంది. 202425 ఆర్థిక సంవత్సరంలో తక్కువ మూలధన ఖర్చులు, 81 బిలియన్ డాలర్ల ఆశాజనక ఎఫ్‌డీఐ దీన్ని రుజువు చేస్తున్నది. అయితే, ఆర్థిక ఆరోగ్యం, చట్టపరమైన సంస్కరణలు, విధాన స్థిరత్వం, సంస్థాగత బలాలపై రాజీ ఎంతమాత్రం కుదరదు.
2024 ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజారిటీని కోల్పోవడంతో విధానపరమైన అనిశ్చితి నెలకొంది. చట్టపరమైన, ఆర్థిక సంస్కరణలను ఇది సంక్లిష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపార వర్గాలు ప్రభుత్వ గణాంకాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వతంత్ర శ్రామిక మార్కెట్ డేటా, ఆ రంగం పనితీరు సూచీలు, ప్రైవేట్ ఆడిట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉంది.
ఎస్ అండ్ పీ అప్‌గ్రేడ్ పెరుగుతున్న ప్రపంచ విశ్వాసానికి ఒక సూచిక. కానీ, ఇది లోతైన నిర్మాణాత్మక మార్పు లేదా సమగ్ర ఆర్థిక విజయాన్ని ధ్రువీకరించదు. బీజేపీ పాలనలో భారతదేశ అభివృద్ధి గాథ వైరుధ్యాలతో నిండి ఉన్నది. ఆకర్షణీయమైన వృద్ధి గణాంకాలు, నిరంతర నిరుద్యోగం, పెరుగుతున్న అసమానతలు, రాజీపడిన గణాంక నిర్వహణతో ఇది కూడి ఉన్నది. పురోగతి సాధించడం వాస్తవం. అదే సమయంలో సందేహాలు కూడా వాస్తవమే.భారతదేశం ఇప్పుడు పతాక శీర్షికల్లో కనిపించే విజయాల నుంచి గణనీయమైన సంస్కరణల వైపు కదలాలి.
అంటే డేటాలో సమగ్రతను పునరుద్ధరించడం, స్వతంత్ర సంస్థలను బలోపేతం చేయడం, పారదర్శక పద్ధతులను ప్రోత్సహించడం, అధికారిక గణాంకాలపై కఠినంగా ఆడిట్ చేయడం. అప్పుడే భారతదేశ వృద్ధి విస్తృతంగా, దీర్ఘకాలికంగా, నిజంగా, సమగ్రంగా ఉంటుంది. ప్రస్తుతానికి రేటింగ్ అప్‌గ్రేడ్ ఒక మైలురాయి మాత్రమే. ఫినిష్ లైన్ కానే కాదు. పాలకులు, ఇన్వెస్టర్లు, పౌరులు భారతదేశ పురోగతిపై సంబురాలు జరుపుకొంటే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆశావాదంతో, శ్రద్ధతో, పారదర్శకతతో జవాబుదారీతనంపై అచంచలమైన నిష్ఠతో మాత్రమే విజయోత్సవాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే భారతదేశ ఆర్థిక కథనం పూర్తిగా, అందర్నీ ఒప్పించేలా చెప్పబడుతుంది.
– (వ్యాసకర్త: పూర్వ సీనియర్ ఎడిటర్, ది ఎకనామిక్ టైమ్స్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్)
సీఆర్ సుకుమార్