‘సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు గోదావరి నదిలో అస్సలు నీళ్లే లేవని ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ, ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి నీళ్లు ఉన్నాయని చూపించారో.. వెంటనే మాట మార్చి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ కొత్త పాట పాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బాగుచేసి, ఆ నీళ్లు గనుక పొలాలకు తెస్తే..ఎక్కడ మళ్లీ కేసీఆర్‌కు మంచి పేరొస్తుందోననే కదా మీ అసలు బాధ?’
సాధారణంగా సగం పాలనాకాలం పూర్తయ్యేసరికి ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నీటి లభ్యత, వ్యవసాయంపై కనీస అవగాహన వస్తుంది. కానీ.. మన రేవంత్‌రెడ్డికి మాత్రం కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల గురించి ఇప్పటికీ ఏం తెలియకపోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఒక రాష్ర్టానికి సీఎంగా ఉన్న వ్యక్తి అజ్ఞానాన్ని చూసి ఇవాళ మేధావులు, సామాన్యులే కాదు.. చివరకు ఆయన పక్కన ఉండే మంత్రులు సైతం జాలితో తలదించుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రెస్మీట్లో సీఎం మాట్లాడుతూ..మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటర్లు ఎలా ఆన్ చేస్తారు? అంటూ ఒక విచిత్రమైన మేధావితనాన్ని ప్రదర్శించారు.
ముఖ్యమంత్రికి ప్రాజెక్టుల ఇంజినీరింగ్ గురించి కనీస అవగాహన లేకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారని పక్కనే ఉన్న సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి వెంటనే అర్థమైపోయింది. దీంతో ఆయన కంగారుగా మైక్ తీసుకొని.. ‘గేట్లు మూయకుండా కూడా నదిలో ప్రవహించే నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు’ అని సీఎం అజ్ఞానాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సీఎం స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇంతటి అజ్ఞానంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజానీకమే ఆలోచించాలి.
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ‘మేడిగడ్డ రిపేరు విషయం తర్వాత… ముందుగా కన్నెపల్లి మోటార్లు నడపండి.. రైతుల పొలాల్లో నీళ్లు పారించి మమ్మల్ని కాపాడండి‘ అని రైతులు, బీఆర్ఎస్ నాయకులు అడిగితే.. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే సమాధానం విని తెలంగాణ సమాజం అంతా షాక్‌కు గురైంది. ‘బీఆర్ఎస్ నాయకులను కోసి, ఆ రక్తం పొలాల మీద చల్లితే పంట పండుతది’ అంటారా? ఒక రాష్ట్ర సీఎం మాట్లాడే భాషేనా ఇది? రైతులు సాగునీరు అడుగుతుంటే..రేవంత్ మాత్రం రక్తం భాష, కక్షల భాష మాట్లాడుతున్నారు.
గడిచిన రెండున్నరేండ్లుగా రేవంత్ నోట ప్రజా సంక్షేమం మాటలు సరిగా వినబడలేదు. ఎప్పుడుచూసినా సమాజాన్ని కలుషితం చేసే అరాచక పదజాలమే వినబడుతున్నది. లాగుల తొండలు ఇడుస్తా.. పండబెట్టి తొక్కుతా! పేగులు తీసి మెడలో వేసుకుంటా..బీఆర్ఎస్ నేతల రక్తం పొలాలకు పారిస్తా! బీఆర్ఎస్ గద్దెలు కూల్చేయిస్తా.. మీ కనుగుడ్లు పీకి గోటీలాడుతా! మీకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా! అని కూడా అంటడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే నైతిక భాష? ప్రజలకు, రైతులకు ఏ ఒక్క మంచి పనీ చేయలేదు గనుకనే ఇవాళ ప్రభుత్వంపై రాష్ట్రం అంతటా అన్నివర్గాల్లో వ్యతిరేకత బాగా పెరిగింది.
అది తట్టుకోలేకనే సీఎం ఫ్రస్టేషన్‌తో ప్రతిపక్షాలపై బూతులు మాట్లాడుతున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. రేవంత్ పాలనలో తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయి. నాడు కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంతోపాటుగా, తెలంగాణ పల్లెలు… నేడు గంజాయి, హత్యలు, దందాలకు కేరాఫ్‌గా మారాయి. రైతులకు నీళ్లివ్వడం చేతకాదు, యూరియా ఇవ్వడం చేతకాదు. ఈ అరాచక, పాలనను సామాన్యులు, ప్రభుత్వ అధికారులు కూడా భరించలేకపోతున్నారు.
‘బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో 48 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది కేసీఆర్ కదా? మరి రేవంత్ రెండున్నరేండ్ల పాలనలో కనీసం ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? ‘గురుదక్షిణ కింద ఆంధ్రప్రదేశ్‌కు మన తెలంగాణ నీళ్లను అప్పనంగా వదిలేస్తున్నది ఇదే రేవంత్‌రెడ్డి కాదా?‘ ‘మన నీళ్లను ఎందుకు వదిలేస్తున్నారు? సీఎంని ఇక్కడ నిలదీసేవాళ్లు, అడిగేవాళ్లు ఎవరూ లేరనుకున్నారా? ఎంతకాలం ఈ తప్పుడు ప్రచారాలు, దొంగ డ్రామాలు ఆడుతారు? ఇంకెంతకాలం రైతులను మాయచేస్తారు? తమ స్వార్థ రాజకీయాల కోసం ఇంకెంతకాలం రైతులను తప్పుదోవ పట్టిస్తారు? మొన్నటిదాకా రిటైర్డ్ ఇంజినీర్లను గొప్ప నిపుణులంటూ సీఎం ఆకాశానికెత్తారు.
కానీ, ఎప్పుడైతే అదే నిపుణులు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలాలని సూచించారో.. వెంటనే మాట మార్చి వారిని జైల్లో పెడతానని బెదిరిస్తున్నారు. నిజాలు మాట్లాడినందుకు వారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి లొంగిపోయారని ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెలంగాణ రాకముందు.. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 6 లక్షల 64 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారనే వాస్తవాన్ని మర్చిపోయారా?
అదే బీఆర్ఎస్ పాలనలో.. ఏకంగా 48 లక్షల 74 వేల ఎకరాలకు రికార్డు స్థాయిలో సాగునీరు అందించామనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కన్నెపల్లి, దేవాదుల మోటర్లను వెంటనే ఆన్ చేసి, యుద్ధప్రాతిపదికన నీళ్లను విడుదల చేయాలి. రైతులను కరువు బారి నుంచి తక్షణమే కాపాడాలి. లేనిపక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంగా.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతులందరినీ ఏకం చేస్తాం, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తాం. మిమ్మల్ని ప్రజల ఎదుట దోషిగా నిలబెడతాం.. అన్నదాతల కడుపు మంట, ప్రజల ఆగ్రహం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం!
– (వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు) పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి