పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే బీజేపీకి వచ్చే లోక్‌సభ ఎన్నికలలోనూ దక్షిణ భారతం వశపడదు. ఆ మాట వారికీ తెలుసు. అయితే ఈ సారి ఉత్తర భారతం కూడా చేజారిపోవచ్చునా? ఆ విషయం ఇప్పటికిప్పుడైతే నిర్ధారణగా అంచనా వేయలేము. కానీ ఆ ప్రమాదమైతే ఉన్నట్టు ఆ పార్టీ నాయకత్వానికి అర్థమవుతున్నదనుకోవాలి. అందుకే ముందు జాగ్రత్త కోసం తిమ్మిని బమ్మిని చేసైనా ఇతర పార్టీలను చీల్చటం, ‘సర్’ పేరిట ఓటర్ జాబితాలను గందరగోళంగా మార్చటం చేస్తున్నారు. ఈ వక్రమార్గాలనైతే అధికార దుర్వినియోగంతో అనుసరించగలరు గానీ, ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకతను ఏం చేయగలరు?
కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాపథం గురించి ఎన్నెన్ని శపథాలు చేసి ఏమేమి వ్యూహాలు రచించినా, ఆ నేల స్వాధీనం కాకపోగా ఈ సారి 2019 నాటి 31 స్థానాలైనా రాగల సూచనలు లేవు. నియోజకవర్గాల పునర్విభజన, సర్ ఎత్తుగడలు అమలుకు వచ్చినప్పటికీ. కారణం, వారిక్కడ స్వయంగా క్షేత్రస్థాయిలో బలపడుతున్నది.
‘పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే’ అన్నమాటకు మొదట కొన్ని వివరణలు చెప్పుకోవాలి. బీజేపీ 2009లో గెలిచిన లోక్‌సభ స్థానాలు 116. ఆ సంఖ్య 2014లో ఒకేసారి 166 పెరిగి 282కు చేరింది. అధికారం లభించింది. లోగడ వాజపేయి నాయకత్వంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సొంత మెజారిటీతో అధికారానికి రావటం ఇదే మొదటిసారి. అట్లా జరగటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి, అప్పుడు ఉండిన మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి, అసమర్థ పాలన విమర్శలను ప్రజలు నమ్మటం. రెండు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ముఖ్యమంత్రిత్వ కాలంలో గుజరాత్ అద్భుతంగా అభివృద్ధి చెందిందనే ప్రచారాలతోపాటు, అదే తరహా గుజరాత్ మాడల్‌ను దేశమంతటా అమలు చేయగలరనే ప్రచారాన్ని కూడా విశ్వసించటం. అందువల్లనే పార్టీ బలం అనూహ్యంగా పెరిగింది. ఆ విధంగా ఐదేండ్లు గడిచినాక, ఆ ప్రచారాలు నిజం కాదని ప్రజలకు అర్థం కావటం నెమ్మదిగా మొదలైంది. గుజరాత్ మాడల్ గురించిన వాస్తవాలు వెలుగులోకి రాసాగాయి.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పించి ప్రతి కుటుంబానికీ రూ.15 లక్షలు ఇవ్వడం వంటి హామీలు వగైరా వట్టివిగా తేలాయి. అయినప్పటికీ మరుసటి 2019 ఎన్నికల్లో బలం తగ్గకపోగా 282 నుంచి 303కు పెరిగింది.
ఎందువల్ల? ఒకటి, మోదీపై భ్రమలు ఇంకా తగినంతగా పోలేదు. రెండు, అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని, ఇతరత్రా కూడా మత భావనలను బాగా పురికొల్పారు. మూడు, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల బలహీనతలు, అనైక్యతలు బీజేపీకి కలిసివచ్చాయి. నాలుగు, మోదీని మించిన నాయకుడు లేడని, తనను యావత్ ప్రపంచం కీర్తిస్తున్నదని, ఆయన చైనా, పాకిస్థాన్‌లకు తగిన శాస్తి చేశారనే ప్రచారాలు హోరెత్తించారు. ఐదు, ఆర్థిక రంగంలో మనం బ్రిటన్, జర్మనీ, జపాన్‌లను మించిపోయి, ప్రపంచంలో మూడో స్థానానికి ఎదిగామని, ఇక పోటీ చైనా, అమెరికాలతోనేనని లెక్కలు గట్టి చూపారు. మామూలుగానైతే ప్రజలు ఈ తరహా ప్రచారాలను గత ప్రచారాల వలెనే నమ్మాలి. నమ్మినవారు లేరని కాదు. చాలానే ఉన్నారు. కానీ నమ్మని వారి సంఖ్య పెరగటం మొదలైంది. అందుకే సీట్ల సంఖ్య 2024 ఎన్నికల్లో వారు ఆశించినట్టు 2019 నాటి 303 కన్నా మరింత పెరుగలేదు. సరికదా 2014 నాటి 282 కంటే కూడా తగ్గిపోయి 240 దగ్గర ఆగిపోయింది. ఈ లెక్కలు మరింత సూటిగా అర్థమయ్యేట్టు చెప్పుకొందాము. 2009లో 116; 2014లో 282; 2019లో 303; 2024లో 240. అనగా 2019 కన్నా 63 సీట్లు, 2014 కన్నా 42 సీట్లు తక్కువ. ఇవి స్పష్టంగా పతన సూచీలు.
మరొక విధంగా చెప్పాలంటే, మోదీ నాయకత్వం 2014లో, 2019లో సంపాదించిన సొంత మెజారిటీలు రెండు ఎన్నికలు గడిచి మూడోది వచ్చేసరికి తుడిచిపెట్టుకుపోయాయన్నమాట. ఇప్పుడు ‘మోదీ మాడల్’ అనే మాటను ప్రజలు మరచిపోయారు. స్వయంగా బీజేపీ కూడా అనటం లేదు. ఆ నమూనాలో పరిపాలన అంటే ఏమిటో ఎవరూ చర్చించటమైనా వినిపించదు. ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరిన మాట నిజం కాదని, ఇంకా ఆరో స్థానంలోనే ఉన్నామని తెలిసిపోయింది. ఈ తరహా స్థానాల మాట ఎట్లున్నా వేర్వేరు అభివృద్ధి సూచీలు అన్నింటిలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన ర్యాంకులు పతనమవుతుండటమే కనిపిస్తున్నది. రూపాయి విలువ దారుణంగా పతనమవుతున్నది. ధరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివిధ దేశాల పర్యటనలు జరిపి అక్కడి నాయకులను ఎంత కౌగిలించుకుంటున్నా వారు మనను తమ ఆర్థిక ప్రయోజనాల కోసం, సైనిక వ్యూహాల కోసం ఉపయోగించుకొనజూడటం మినహా నిజమైన గౌరవం అంటూ పెరుగుతున్నదిలేదని బోధపడుతున్నది. అమెరికా అధ్యక్షుడు తరచూ ఈసడిస్తున్నా, ఇజ్రాయెల్ ప్రధానితో మితిమీరిన మైత్రీబంధం ఎంత అప్రదిష్టను తెస్తున్నా మోదీ తీరు మారకపోవటాన్ని ఇప్పుడందరూ గుర్తిస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అన్నమాట పరిధిలోకి ఇవన్నీ వస్తాయి. ఇవేకాదు, మరికొన్ని కూడా ఉన్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి అట్లుంచి 12 ఏండ్లలో కలిపి కూడా అవి కనిపించటంలేదు.
ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నది ఓట్ల కోసం చెప్పిన మాట అని ఇప్పుడు వారు కూడా సిగ్గు విడిచి ఒప్పుకొంటున్నారు. నల్లధనం వెనుకకు రాకపోగా మరింత తరలిపోతున్నది. వేలకు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారిలో కనీసం ఒక్కరినైనా గత 12 ఏండ్లలో వెనుకకు రప్పించలేకపోయారు.
ఇదంతా చాలదన్నట్టు తమకు అనుకూలురైన ధనవంతుల బ్యాంకు అప్పులను లక్షల కోట్ల రూపాయల మేర మాఫీ చేస్తున్నారు. ఆ భారమంతా ఏదో రూపంలో తమపై పడేదేనని ప్రజలకు అర్థమవుతున్నది. ప్రైవేటీకరణను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను తమ వారికి విచ్చలవిడిగా కట్టబెడుతున్నారు. ఆగస్టు 29 నాటికి ఒక వార్త ప్రకారం, టెక్సాస్ టెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు జరిపిన ఒక అధ్యయనంలో మోదీ 2014లో ప్రధాని కాకపోయి ఉంటే ఇండియా మరింత సంపన్నం, ప్రజాస్వామికం అయి ఉండేది.
ఇటువంటి పరిపాలనా ఫలితంగానే బీజేపీ బలం ఒక్కసారిగా, అనూహ్యమైన రీతిలో 2024 ఎన్నికల్లో పడిపోయింది. ఇతరుల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎదురై పార్టీ నాయకత్వాన్ని, సంఘ్ పరివార్ నాయకత్వాన్ని కూడా భయపెట్టింది. దానితో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ అంతటి వ్యక్తి ఎన్నడూలేని రీతిలో బీజేపీ నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేయవలసివచ్చింది. అయితే, కాళ్ల కింద నేల దక్షిణాదిన ఎన్నడూ అందకపోగా, ఉత్తరాన కూడా కదలిపోతున్నట్టు అర్థమై కూడా నాయకత్వం సక్రమ మార్గంలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నించే బదులు వక్రమార్గాలను అనుసరిస్తుండటం ఉపయోగపడకపోగా వారికే కొత్త ముప్పుగా మారగల అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాపథం గురించి ఎన్నెన్ని శపథాలు చేసి ఏమేమి వ్యూహాలు రచించినా, ఆ నేల స్వాధీనం కాకపోగా ఈ సారి 2019 నాటి 31 స్థానాలైనా రాగల సూచనలు లేవు. నియోజకవర్గాల పునర్విభజన, ‘సర్’ ఎత్తుగడలు అమలుకు వచ్చినప్పటికీ. కారణం, వారిక్కడ స్వయంగా క్షేత్రస్థాయిలో బలపడుతున్నది 2014కు ముందు గానీ, అప్పటి నుంచి ఈ 2026 వరకు పన్నెండేండ్లలో గానీ స్వల్పమే కాగా, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆవరిస్తున్న కారుమేఘాలు ఇక్కడ కూడా కమ్ముకుంటున్నాయి. వాటిని పారదోలగల నాయకులు కనిపించటంలేదు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అని మొదట అనుకున్న మాటలు, మరింత దట్టం కావొచ్చునని ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. అవి అందరూ చర్చిస్తున్నవే అయినా సందర్భం వచ్చింది గనుక మరొకమారు చెప్పుకోవాలంటే, ‘సర్’ మాయాజాలం వల్ల మోదీపై ప్రజలకు అనుమానాలు వేగంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం మరికొన్ని కారణాలు. అవినీతి కుంభకోణాలు, ధనిక వర్గాల అనుకూలతలు, విచ్చలవిడి ప్రైవేటీకరణలు 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ఎట్లా పెంచాయో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.
అధికారం కోసం సీబీఐ, ఈడీ, పన్నుల శాఖలను, ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగపరచటం, కోర్టులను, మీడియాను లొంగదీసుకోవటం, ప్రతిపక్షాలను ప్రలోభాలతో చీల్చటం, మొత్తం దేశంలోనే భయకంపిత వాతావరణాన్ని సృష్టించి ఒక్కొక్క స్వేచ్ఛనే నేలరాయటం, ఇతర మతాల వారిపై ద్వేషభావాలు పెచ్చరిల్లజేసి అణచివేయటం వంటివి క్రమంగా పరాకాష్ట స్థితికి చేరుతున్నాయి.
భారత ప్రజాస్వామ్యం అర్ధ ఫాసిజంగా మారుతున్నదనే చర్చలు సైతం దేశవిదేశాలలో మొదలయ్యాయి. అయితే, ఎంత బలమైన గొలుసుకైనా ఎక్కడనో ఒక బలహీనమైన లంకె ఉంటుందనే సామెత ఒకటి ఇంగ్లిషులో ఉన్నది. ‘పరిస్థితులు ఇదే విధంగా’ అన్నమాటలోకి ఆ విధమైన ఇటీవలి పరిణామాలు కొన్నికూడా వస్తాయి. ఆ విధంగా మూడు ఘటనలు గత కొద్ది మాసాల్లో వెంటవెంటనే చోటుచేసుకున్నాయి. ఒకటి కాక్రోచ్లు, రెండు రామమందిర నిధుల తస్కరణలు, మూడోది మూడు ఉప ఎన్నికలు. వాటి ప్రభావాలపై విస్తృతమైన చర్చలు జరుగుతూనే ఉన్నందున ఇక్కడ ఇంకా మాట్లాడనక్కరలేదు. అయితే ఈ మూడు ప్రభావాలు ఉత్తరాది పైనే ఎక్కువగా ఉండటం గమనించదగ్గది. అవే వారి ప్రమాదఘంటికలు అవుతున్నాయి.
బీజేపీ అధికారసౌధపు కర్ర స్తంభాలకు, దూలాలకు చెదలు పట్టడం మొదలైనట్టు గత ఎన్నికల్లోనే వెల్లడైంది. ఇప్పుడు జరుగుతున్నది ఆ సౌధాన్ని చెదలు మరింత డొల్లగా మార్చుతుండటమే. ఆ స్థితిని మార్చగల దృక్పథాలు శక్తిసామర్థ్యాలు, రుజుధోరణులు, నిజాయితీలు, సాహసాలు నాయకత్వాలకు లేవు. వారికి గల లక్షణాలన్నీ చతురోపాయాలతో అధికారాన్ని అనుభవించజూడటం మాత్రమే. ఈ దేశ ప్రజలు వేచి చూడవలసింది ఈ కృత్రిమ సౌధపు శిథిల ఘడియల కోసమే. దక్షిణం ఎట్లాగూ దక్కదు. జరుగవలసింది చేజారుతున్నట్టు కనిపిస్తున్న ఉత్తరం నిజంగానే చేజారటం.
టంకశాల అశోక్