నేడే హోలీ
మనమంతా ఒక్కటవ్వాలి
నేడే హోలీ
ఆడే పాడే ఆనందాల హేళి
జానపదుల జావళి
జాజిరి పాటల మంజరి
హోలీకాపై విజయభేరి
వసంతోత్సవ కేళీ
రంగురంగుల రంగేళీ
కుల మత భేదాల్ని వీడి మనమంతా ఏకమవ్వాలి
ప్రకృతి దోసిట్లో రంగులన్నీ దాగితే కమ్ముకున్న చిమ్మచీకటి
దోసిట్లోంచి ఒక్కో రంగు ఒలికితే వెలుగుల దివిటీ
ఆ దివిటీల వెలుగుల్లో
తిమిరాన్ని తరిమే
ఆనందాల డోలిక
భోగి మంటల్లో
కాముని దహన వేదిక
తనలోని కొత్త రంగుల్ని చూసి
పుడమి పులకించే వేడుక
సప్తవర్ణాల దృశ్యమాలిక
ప్రకృతి పరవశించి
కోయిలతో పాడే రుతు గీతిక
శిశిరానికి సెలవంటూ
వసంతం ఒడిలోకి హోలీ చేరిక
డాక్టర్ రానవేయిన రమేష్