ఈ వ్యాసం ‘ఉత్తరప్రదేశ్’కు చెందినదే అయినా, పాఠకులు సదువుకునేందుకు వీలుగా పాత్రలు తెలంగాణ భాషలోనే మాట్లాడుతయి.
ఢిల్లీ నుంచి బైలెల్లిన విమానం ‘అలహాబాద్’ల, సారీ పేరు మారింది గదా? ‘ప్రయాగ్‌రాజ్’ల ఆగింది. బీజేపీకి చెందిన ఓ వీఐపీ (సెంట్రల్ మినిస్టర్) నెత్తికి కాషాయం రుమాల్ సుట్టుకొని మాతో పాటు అదే విమానంల అచ్చిండు. ఆయన కోసం ఓ ఆరేడు కార్లు, ఓ పదిరువై మంది పోలీసులు బైట ఎదిరిజూస్తున్నరు. నాయకులు, కార్యకర్తలు గల్సి పోలీసులున్నంత మంది గూడ లేరు. ఒకే ఒక్క నాయకుడు మాత్రం పూల బొకే వట్టుకొని బైట నిలవడ్డడు. ‘ఓర్నీ ఒక సెంట్రల్ మినిస్టరొస్తే’ కనీసం కదర్ గూడ జేస్తలేరుగానే ఇక్కడి ప్రజలని మా అన్నతోని వాపోయిన.
మేమందరం గల్సి ఒక్కటే విమానంల అచ్చినప్పటికీ ఈ పెద్దమనిషి మాత్రం ఇంకా బైటికి రాలే. ‘ఏమైందో ఆ పెద్దమనిషికి ఇంకా రాకపాయెనని’ మా అన్ననడిగిన. ‘వీఐపీ లాంజ్‌లకు వోయిండు. దోతి గినా సదురుకోవద్దా’ అని జెప్పవట్టిండు. ‘అవునవును.. అస్సలే సెంట్రల్ మినిస్ట్టరాయె.. జెప్పనొస్తే గూడ కదరుండది, బైటున్నోళ్లను గూడ కొద్దిసేపు నిలవెట్టాలె కదా’ అని అంటే మా అన్న గూడ నవ్వవట్టిండు. మీం ఇద్దరం గల్సి టాక్సీ కోసం వోయినం. మేం కనవడంగనే ఏడెనిమిది మంది డ్రైవర్లు మా సుట్టుముట్టిర్రు. అంటే వీళ్లు గూడ అప్పటిదాన్క ఆ నాయకున్ని పట్టించుకోలేదన్నమాట.
ఒక టాక్సీ డ్రైవర్ (ముస్లిం)కు, మాకు బ్యారం కుదిరింది. మా తొవ్వ సంగం (త్రివేణి సంగమం)కు సాగుతున్నది. ‘అన్నా.. ఎవ్వలో పెద్ద మినిస్టరొస్తండు, అయినా.. కనీసం పది మంది గూడ లేరె మే…’ అని టాక్సీ డ్రైవర్నడిగిన. ‘అన్నా వాళ్లొస్తరు, వోతరు.. వాళ్లకోసం మనం పని వోగొట్టుకొని తిరుగుతే’ మన కడుపెట్ల నిండాల్నే’ అనవట్టిండు ఆ డ్రైవర్. ‘అన్నా.. ఎయిర్‌పోర్టు ఔతల ‘ప్రయాగరాజ్’ అని బోర్డు పెద్దగనే వెట్టిర్రేందే’, ‘అన్నా.. ప్రయాగరాజ్‌కు కొత్తగొస్తున్నరా, ఇంతకుముందుగూడ అచ్చిండ్రా’ అని ఉల్టా నన్నే అడగవట్టిండు డ్రైవరన్న.. ‘ఎందుకే’ అని ఆత్రంగా అడిగిన. ‘మారింది గా పేరే అన్న’ అని టాక్సీ డ్రైవర్ జెప్పవట్టిండు.
త్రివేణి (గంగా, యుమున, సరస్వతి) సంగమంల తానం జేసొద్దామని యము నా నది దగ్గర నిలవడ్డం. ‘సార్ పడవ గావాల్నా?’ అని ఓ పదిరువై మంది పడ వ నడిపేటోళ్లు మా దగ్గరికొచ్చిర్రు. ఆకరికి ‘అజిత్ నిషాద్’ అనే యువకునితోని మాకు బ్యారం కుదిరింది. రామున్ని నది దాటించడానికి పడవ నడిపిన నిషాదుల వంశస్థుడు ఈ అజిత్. ఆయనది ప్రయాగరాజ్‌కు సమీపాన ఉన్న నూకల్ అనే పల్లెటూరు. పెండ్లాం ఇద్దరాడివిల్లలు ఊళ్లనే ఉంటరు. అజిత్ పన్నేండ్ల వయసున్నప్పటి నుంచి ఈ పడవ నడుపుకొంటనే జీవితం ఎల్లదీస్తున్నడు. అట్లా అని పడవకు ఓనర్ కాదు, డ్రైవర్ మాత్రమే. నెలకు 15 వేల జీతం. అజిత్‌కు ఇప్పుడు 27 ఏండ్ల వయసుంటది. ‘మీ ముఖ్యమంత్రి ఎవరు అజిత్ భాయ్..?’ అనడగితే అనుమానం లేకుండా ‘బుల్డోజర్ బా బా’ అని జవాబిచ్చిండు. ‘యోగికి బుల్డోజర్ బాబా అనే పేరు ఎందుకొచ్చింద’నడిగితే ఎదురుతిరిగిన ముస్లింలను ఊచకోత కోస్తున్నడు, వాళ్లిండ్లను బుల్డోజర్లు వెట్టి కూల్చేస్తున్నడు. అందుకే ఆయ్నను ‘బుల్డోజర్ బాబా’ అంటున్నమని జెప్పవట్టిండు. ‘మరి అట్లా కనవడే ఆ అక్బర్ ఖిల్లాకు బుల్డోజర్ ఎందుకు వెట్టలేదు మీ బుల్డోజర్ బాబా’ అనడగిన.. అజిత్ నిషాద్ నుంచి నవ్వే జవాబైంది.
‘బుల్డోజర్ బాబా మీ కోసమేమైనా జేసిండా’ అనడగితే ఏమీ లేదంటన్నడు అజిత్. నాకొక్కసారిగా నిషాద్ ఇద్దరాడివిల్లలు గుర్తుకొచ్చిర్రు. ‘నీ భార్య ఎక్కడ ప్రసవించింది’ అనడిగిన. ‘మొదటి కాన్పు ఎల్లదీసేటందుకు అలహాబాద్‌లోని గవర్నమెంటు దవాఖానకు తీస్కవోయిన్న’ని చెప్పిండు. ‘మంచిగుందా దవాఖాన’, ‘ప్రతిదానికీ లంచమే.. వాళ్లకు ఇచ్చే బదులు ప్రైవేట్ దవాఖానకు తీస్కపోయినా అయిపోవు’ అనిపించిందట. అందుకే రెండవసారి తన భార్య ప్రైవేట్ దవాఖాన్లనే ప్రసవించిందని చెప్పుకొచ్చిండు. ‘మీ ఇంట్ల ఎవరికైనా పింఛన్లు అస్తున్నయా అజిత్ భాయ్..’ అనడగితే ఊహూ అస్తలేవని తలికాయ అటీటూ పిండు. ‘మీకు తెలిసినవాళ్లెవరికైనా అస్తయా’ అనడిగితే.. తనకు తెలిసిన ఒక్క వితంతువుకు రూ.600 అస్తయని గొప్పగ జెప్పిండు. ఇక వృద్ధాప్య పింఛన్లయితే మొత్తం వీఆర్వోల చేతిల్నేనట. వాళ్లు ఇస్తే అచ్చినట్లు, లేకుంటే రాలేదన్నట్లు.. అది కూడా ఎంతస్తదో పాపం అజిత్‌కు తెలువదు. తన బతుకే బాగలేదు. యూపీ ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకా లు గూడ గొప్పగా లేవు. అయినా ‘బుల్డోజర్ బాబా’ అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను గొప్పగా చెప్పడానికి ట్రై జేసిండు అజిత్ నిషాద్.
యూపీ ప్రజలు ఎంత అమాయకులో తెలుసా..!: ఉత్తరప్రదేశ్‌లో ఏ ఇల్లు జూసినా పూర్తయిన ఇల్లు నాకొక్కటీ కనిపించలేదు. ఏ ఇల్లు జూసినా ఒక ముందల్నే నున్నగున్నది. సుట్టూ ఇటుకగోడలే ఉన్నయి. కలరేమో గని కనీసం అస్తర్కార్ గూడ జేయలె. ‘అట్లా ఎందుకు వదిలిపెట్టిర్రే’ అని ఒక టాక్సీ డ్రైవర్నడిగితే ‘పక్కకున్నోళ్లు కట్టుకుంటరు గదా? ఉత్తగా మనమెందుకు ఇప్పుడు కర్సువెట్టుడ’ని జెప్పవట్టిండు.
నేను అజిత్నో, లేక యూపీ సర్కార్నో తప్పువట్టడానికీ వ్యాసం రాయట్లేదు. ఒక్క అజితే గాదు, యూపీలో ఏ యువకున్ని కదిలించినా హిందూ, ముస్లిం తారతమ్యం తేటగ కనవడ్డది. ఇప్పుడు ముస్లింలు ఎక్కువగా మాట్లాడుతలేరనే విషయాన్ని వాళ్లు సంబురంగా చెప్పడం కనిపించింది. పాపం అభం, శుభం తెలువని, ఎనిమిదో తర్గతి దాన్క సదువుకున్న అమాయకుడైన అజిత్‌ను, అజిత్ లాంటి యువకుల అమాయకత్వాన్ని జూస్తే మస్తు బాధనిపిచ్చింది. అక్కడి ప్రజలు, యువకులను పావులుగా వాడుకుంటూ వారిలో విద్వేషాలు నింపుతూ, మత ఘర్షణలను రేపుతున్న పాలకులను జూస్తే కోపం నషాలానికంటింది.
‘ప్రయాగ్‌రాజ్ ఒక నగరం కదా.. మరి ఊరన్నవేంద’ని మీకు డౌట్ కొట్టచ్చు. కానీ నాకు తెలిసీ తెలంగాణలోని ఏ చిన్న పల్లెటూరును జూసినా ప్రయాగ్‌రాజ్ కన్న మంచిగుంటది. ఆ టాక్సీ డ్రైవర్ అన్నట్టు.. మారింది పేరే.. ఊరట్లనే ఉన్నది.
గడ్డం సతీష్
99590 59041