లిప్త కాలంలో ఒక దశాబ్దం కరిగిపోయింది
అల్లుకున్న ఆకుపచ్చని స్వప్నం
మంచు ముద్దలా కరిగిపోయింది
ఎవరి దిష్టి తగిలిందో
అర్ధాంతరంగా ఆగిపోయింది!
తడి ఆరని నేల మీద
ఎడారి ముద్రలు మళ్లీ విచ్చుకుంటున్నవి
వలస పీడకల
పునరుత్థానం పొంది
రైతు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది!
అంతరించి పోయిందనుకున్న
చీకటి వారసత్వం
జడలు విప్పుకొంటున్న దృశ్యం
అనుకున్నట్లే జరుగుతున్నదా
నవ్వేటోని ముంగల జారిపడ్డామా?
అయిదేండ్ల వీలునామా రాసిచ్చి
విలపిస్తున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి!
లోయలో బతుకులు జారిపడ్డాక
ఎవరు ఎవర్ని ఉద్ధరిస్తారు?
ప్రగల్బాలకు పదునుపెట్టి
ప్రలోభపెట్టిన మాట నిజం
సంక్షేమం ముసుగులో
సంక్షోభం వెంటాడుతున్నది!
పాము చిన్నదే కదా అని వదిలేశాక
కర్ర వెతుక్కునేలోపు కాటేసింది!
మరోసారి కప్పం కట్టే సంప్రదాయం
తెరమీదకు వస్తుంటే
పొడుస్తున్న పొద్దు మీద
నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా!!
-సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి