పాత్రికేయ కురువృద్ధుడు జీఎస్ వరదాచారి భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు పాత్రికేయ ప్రపంచంలో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారు. తెలుగు జర్నలిజంపై ఆయన వేసిన ముద్ర, పాత్రికేయ వృత్తికి ఆయన చేసిన సేవ అలాంటిది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జన్మించిన జీఎస్ వరదాచారి బాల్యం యావత్తూ నిజాం పాలనలోనే గడిచింది. ఎనభై ఏండ్ల కిందటి సంగతులు కావాలంటే ఆయనే దిక్కు. ఆయన గ్రహణశక్తి, ధారణశక్తి అసాధారణం. నేర్చుకోవాలనే తాపత్రయానికి ఆయనకు వయసు అడ్డంకి కాలేదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వరదాచారి 75 ఏండ్ల వయసులో కంప్యూటర్ మీద టైప్ చేయడం నేర్చుకొని అనేక పుస్తకాలు రాశారు. ఆ ధారా ప్రవాహంలో వచ్చిందే ఆయన జీవితగాథ ‘జ్ఞాపకాల వరద’. నాటి తెలంగాణ తీరుతెన్నులకు ఈ పుస్తకం అద్దం పడుతుంది.
జర్నలిస్టు కాకముందే ఆయన పత్రికలకు వ్యాసాలు రాసేవారు. అదీ యాదృచ్ఛికంగానే జరిగింది. హైదరాబాద్లో ఉండి పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వివేకవర్ధని కాలేజీలో బాల సాహిత్యంపై సదస్సు జరిగింది. మరాఠీ, కన్నడ తదితర భారతీయ భాషల ప్రతినిధులు అంతకుముందు సంవత్సరం తమ తమ భాషలలో వచ్చిన ఉత్తమ రచనలను ఉల్లేఖనలతో సహా వివరించారు. తెలుగు ప్రతినిధి మాత్రం చెప్పుకోదగిన బాల సాహిత్యం ఏదీ తమ భాషలో రాలేదని చెప్పడం, ఆ సదస్సుకు హాజరైన వరదాచారికి బాధ కలిగించింది. ఇంటికి వచ్చి తన ఆవేశాన్ని కాగితం మీద పెట్టారు. రాయడం అయితే రాశారు కానీ ఏ పత్రిక వేస్తుందనే నిరాశ కలిగింది. చివరికి ‘సంపాదకుడికి లేఖలు’ శీర్షిక కింద ప్రచురించాలని కృష్ణా పత్రిక సంపాదకుడు ఖాసా సుబ్బారావుకు పోస్టులో పంపించారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయన రూమ్మేట్ స్వతంత్ర పత్రిక తెచ్చి ఇందులో నీ వ్యాసం పడిందని చెప్పాడు. వరదాచారి రచనా శైలి నచ్చిన ఖాసా సుబ్బారావు ఆ రచనను ‘ఎదుగూ బొదుగూ లేని తెలుగు భాష’ అనే శీర్షిక పెట్టి 1955 ఆగస్టు 20న కృష్ణా పత్రికలో ప్రచురించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే అలవాటు బహుశా వరదాచారికి ఖాసా సుబ్బారావు నుంచే అలవడి ఉంటుంది. జర్నలిజంలో డిగ్రీతో పాటు న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నప్పటికీ వరదాచారి పత్రికారంగాన్నే వృత్తిగా మలుచుకున్నారు.
ప్రముఖ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు.1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన తన ‘జ్ఞాపకాల వరద’ పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. ‘భారత పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో మెక్మెహన్ సరిహద్దు రేఖను చైనా దాటివచ్చి అతిక్రమణలకు పూనుకున్నది. అది పచ్చగడ్డి కూడా మొలవని ప్రాంతమని ప్రధాని నెహ్రూ పార్లమెంటులో కొట్టిపారేశారు. అతిక్రమణలు ఆక్రమణలుగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ సమయంలో సింహళ దేశ (ఇప్పుడు శ్రీలంక) పర్యటనకు వెళ్తూ నెహ్రూ మద్రాసు విమానాశ్రయంలో విలేకరులకు చిక్కారు. ఉత్తరాన దురాక్రమణలు జరుగుతుంటే మీ విదేశీ యాత్ర ఏమిటని ఒకరు ప్రశ్నించారు. వారిని బయటకు తోసివేయమని మన సైన్యాన్ని ఆదేశించానని నెహ్రూ గంభీరంగా జవాబు చెప్పారు’.. ఈ వివరాలన్నీ ‘జ్ఞాపకాల వరద’లో ఉన్నాయి.
‘వార్త పవిత్రం, వ్యాఖ్య మీ ఇష్టం’ అనే నానుడి జర్నలిజంలో ఉన్నది. వార్త ఆధారంగా చేసే వ్యాఖ్యలు సహేతుకంగా, తార్కికంగా ఉండాలని వరదాచారి కోరుకొనే వారు. పార్లమెంటులో, పత్రికల్లో అలా జరగడం లేదన్నది ఆయన భావన. తెలుగు పాఠకులకు చక్కని రచనలు అందించిన వరదాచారి తన సుదీర్ఘ అనుభవాలను అక్షరబద్ధం చేసి పరలోకానికి తరలిపోయారు.
-భండారు శ్రీనివాసరావు