పడిలేచిన కెరటం నా తెలంగాణ
నివురులోంచి పునరుజ్జీవం
పోసుకున్న ఫీనిక్స్ నిప్పు..
నా తెలంగాణ
వలస పాలన కమురు వాసనకు
స్వయంపాలన సాంబ్రాణి
విరుగుడు.. నా తెలంగాణ
కాలిన బతుకులకు కలికుండ మెతుకన్నం.. నా తెలంగాణ
కన్నీటి గుండెలకు స్వయం పాలన సాంత్వన.. నా తెలంగాణ
సబ్బండ సహజీవన బంధాల వజ్రపు బంధం.. నా తెలంగాణ
మహోన్నత మానవ సంబంధాల మాయిముంత.. నా తెలంగాణ
స్వయంభువ వైభోగమే తప్ప
పరాయి సామంతాన్ని ఇసుమంత కూడా ఓర్వలేని ధీర..
నా తెలంగాణ
అధికార కామాంధుల కుటిల
దురాక్రమణ క్రూర చేష్టలను చెండాడగల సవ్యసాచి..
నా తెలంగాణ
ఆధిపత్య అహంకారాలను
మట్టి కరిపించడం
పుటుకకు ముందే నేర్చిన త్యాగి.. నా తెలంగాణ
మాయా మశ్చేంద్రజాలాలు
నడిపించే రాజభవనాల
మారీచ ముసుగు వేషాలను
ఇట్టే పసిగట్టగల యోగి..
నా తెలంగాణ
కల్మషం లేని నిండు మనసుతో ఆత్మీయ ఆలింగనమే కాదు
కత్తులు కడుపులో పెట్టుకొని
కావలించుకోవాలనుకునే
దుష్టులను కదన రంగానికీడ్చి మట్టి కరిపించగల యోధ..
నా తెలంగాణ
దట్టీ కట్టి.. జుట్టు పట్టి..
సుట్ట జుట్టి కుట్రదారుల పని పట్టగల పోరు బిడ్డ.. నా తెలంగాణ
కుట్రల కుయుక్తులను చెండాడగల చంద్రశేఖర హరోం హర హర హర తాండవ ఢమరుక గర్జన..
నా తెలంగాణ
– సహస్ర