India’s GDP : భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధిరేటు అంచనాలను మించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది ఆర్బీఐ అంచనాలకంటే అధికం. ఆర్బీఐ 7 శాతం వృద్ధినే అంచనా వేయగా.. 7.8 శాతం వృద్ధి రేటు నమోదైంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో, తొలి త్రైమాసికం అయిన ఏప్రిల్-జూన్ నెలల్లో భారత జీడీపీ అంచనాల వివరాల్ని కేంద్రం సోమవారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇండియా గణనీయమైన వృద్ధి సాధించిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ రూ.75.46 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది రూ.81.36 లక్షల కోట్లు అంచనా వేసినట్లు తెలిపింది.
ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ లేదా నామినల్ జీడీపీ అంచనా రూ.88.27 లక్షల కోట్లుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఇదే మొదటి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.80 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో ఇప్పుడు 10.3 శాతం వృద్ధిని కనబర్చింది. గ్రాస్ వాల్యూ యాడెడ్ కూడా వృద్ధిని నమోదు చేసింది.