బాపు బాలాజీరావు ప్రైవేటు బస్సు డ్రైవర్. అయినా.. ఆయనకు వార్తలంటే బమ. నాతో పేపర్ సదివిస్తూ వార్తలు వినడం ఆయనకల్వాటు. అట్లా తెల్లారి లెవ్వంగనే నేను వార్తలు సదువుతా ఉంటే, ఆయన ఆ వార్తలు వింటుండె. ఇంపార్టెంట్ వార్తొచ్చినప్పుడు ఆగుమని.. ఆ వార్త గురించి వివరంగా, మొత్తం శెప్తుండె.
1999ల అనుకుంటా.. ‘వలస కూలీల మృతి’ అనే హెడ్డింగ్ సదువంగనే నా చేతిలున్న పేపర్ గుంజుకొని మిగతా వార్త బాపే నాకు సదివినిపిచ్చిండు. ఆ వార్త సదువుతా ఉంటే బాపు కండ్లు భగభగ మండే సూర్యు ని లెక్క ఎర్రగైనయి. ఆ వార్తలున్న సారాం శం ఏమంటే.. మా ఏరియా నుంచి ఆరుగు రు కూలీలు మిజోరం రాష్ర్టానికి వలసవోయి ర్రు. అక్కడేదో ఆపదొచ్చి ఆ ఆరుగురు అక్కడికక్కడే కాలంజేసిర్రనేది సమాచారం. వారి శవాలను ఇక్కడికి తీస్కరావడానికి ఆ కుటుంబాల దగ్గర అణాపైస లేదంటే, అప్ప టి ప్రభుత్వాలు వారిని పట్టించుకోలే. అనాథల్లెక్క వాళ్ల దహన సంస్కారాలను మిజోరంలనే జేసిర్రు.
ఆ వార్త సదువుడైనంక ‘1969లనే తెలంగాణ అచ్చేదుంటే మనకీ గతి వట్టక పోవురా’ అని బాపు నాతోని శెప్పుకుంటా మస్తు బాధవడ్డడు. అప్పటికే అడ్డాకు వోయేటందుకు అమ్మ దెచ్చే అన్నం డబ్బా కోసం ఎదిరిసూత్తున్నడు. ఇంతల అమ్మ సరోజ ‘బియ్య మైపోయినయి, ఇయ్యాల్ల డబ్బా లేదు. రాజుగాడు మజ్జాన్నం వొయి కంట్రోల్ బియ్యం దెస్తే రాత్రి తిందువు తీ’ అని శెప్పింది. మారు మాట్లాడకుండా అడ్డా బాటవట్టిండు. బాపు జూపిన తొవ్వ, పాలమూరు కరువు పరిస్థితులు నాకు తెలంగాణ మీద మమకారాన్ని, ప్రేమను పెంచినయి. అప్పుడు నా వయస్సు ఇరువై రెండేండ్లు. సందు దొర్కితే సాలు ‘మా తెలంగాణ మాకెందుగ్గావాలె?’ అనే దాని మీద చర్చ జేసేటోన్ని. మా షాద్‌నగర్ లైబ్రరీలకు వొయి తెలంగాణ గురించి సమాచా రం ఉన్న పుస్తకాలకోసం ఎంకులాడేటోన్ని.
2001.. ఫక్తు తెలంగాణ కోసం కొట్లాడే ఒక పార్టీ అస్తుందని, ఆ పార్టీకి నాయకుడు కేసీఆర్ అని తెలిసింది. ‘తెలంగాణ గురించి పార్టీ వెట్టడం, స్వార్థానికి వాడుకోవడం.. తర్వాత ఏదో పార్టీల కలుపడం.. ఇదివరకు ఎంతమందిని సూల్లేదు తీయి’మని కొంతమంది ఎక్కిరిచ్చిర్రు. కేసీఆర్ అందరసొంటోడు కాదని నమ్మకం కుదిరింది. ‘రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చితీరుతద’నే ఆయన నినాదం నచ్చి టీఆర్ఎస్ పార్టీ షురు వైనంక పదిరోజులకు గులాబీ కండువా వేసుకున్న. అప్పట్నుంచి కేసీఆర్ నేతృత్వంల తెలంగాణ కోసం ఎక్కడ కొట్లాట జరిగినా నేనున్న. గోడల మీద అంటించే పోస్టర్ల కింద గోధుమ పిండినైన. బట్ట బ్యానర్ల మీద ‘జై తెలంగాణ’ అని రాసే కుంచెనైన. 2003 జూలై 16వ తారీఖు అలంపూర్ నుంచి గద్వాల వరకు ఆర్డీఎస్ నీళ్లకోసం కేసీఆర్ పాదయాత్ర షురూ జేసిండు.
ఆ పాదయాత్రల నిరంజన్‌రెడ్డి సార్ గూడ ఉన్నడు. అప్పట్నుంచి వాళ్లిద్దరి అడుగుల్ల అడుగైన. ఆ పాదయాత్రకు ఇసుకవోత్తే రాలనంత జనం. ‘జై తెలంగాణ’ నినాదం మార్మోగుతున్నది. ఆ జనం సప్పుళ్ల నడుమ తోటి ఉద్యమకారుడు ఏనుగు మహేందర్‌రెడ్డి శెవుల్ల ఏదో శెప్తున్నడు గని ఇనవడ్తలేదు. ఆయనటు శెవుల్ల ముచ్చట శెప్తనే ఉన్నడు ఇటు నేను ‘జై తెలంగాణ’ అనే నినాదం చేస్తనే ఉన్న. అట్లా మూడుసార్లు జెప్పినా ఇనవడకపోయేసరికి పక్కకు గుంజుకవోయి ‘బాపు పానం మంచిగ లేదంట, నువ్వింటి కివో’ అని ఇంటికి దోలిండు. అప్పుడు నా జేబుల చిల్లి గవ్వ లేదు. ఇసుక లారీ డ్రైవర్లు ఇచ్చిన లిఫ్టులతోనే ఇల్లు జేరిన.
ఇంటికివొయి జూత్తే బాపును ఇంటిముందు పండవెట్టిర్రు. ఆయన మీన కప్పి ఉన్న తెల్లబట్ట ‘మీ బాపు లేడు’ అని జెప్పవట్టింది. బాపు జరిగిపోయిన బాధల నేనుంటే కనవడ్డ సుట్టాలందరు నన్ను తిట్టవట్టిర్రు. అయినా బాధవల్లె. బాపు తెలంగాణ కోసం తెగించి కొట్లాడుమన్నడు. కొట్లాడేటోళ్లతోనే కొసెల్లేదాన్క ఉండుమన్న డు. బాపు తెలంగాణ గురిం చి శెప్తే, కేసీఆర్ తెలంగాణ ఎట్లా దెచ్చుడో శెప్పిండు. అట్లా.. కేసీఆర్ మాటలిన్నప్పుడల్లా బాపే గుర్తుకొస్త డు. ఆయనలోనే బాపును జూస్కున్న.
2009 నవంబర్ 29న నా పెండ్లి.. కన్నారం, అల్గునూరు కాడ కేసీఆర్ అరెస్టయిండని తెల్సింది. అటు పెండ్లి జర్గుతనే ఉన్నది. నా మనసంతా కేసీఆర్ మీదున్నది. మా అల్లున్ని పంపి నల్ల రిబ్బన్ దెమ్మన్న. అదే నల్లరిబ్బన్ కట్టుకొని నా పెళ్లానికి తాళిబొట్టు కట్టిన. పెండ్లికచ్చినోళ్లందరు పరేషా న్ అయిర్రు. యూనిఫాం మీద ఓ పోలీసాయన పెండ్లికచ్చిండు. నన్ను అరెస్టు జేసేటందుకచ్చిండేమోననుకున్న. కానీ ఆ పోలీసాయన ‘అచ్చింతలేసేటందుకు అచ్చిన’ అన్జెప్పంగనే అయ్యగారు ఆయన చేతిల అచ్చింతలు వెట్టిండు. 2009 డిసెంబర్ 6 నాడు కేసీఆర్ పానం మంచిగ లేదని తెల్సి పెద్ద లొల్లి జేసినం. ఇంకా నా చేతికున్న పెండ్లి కంకణం గూడ వోలె. నన్ను అరెస్టు జేసి, 14 రోజులు జైల్ల వెట్టిర్రు. ‘తెలంగాణ ఎందుకు గావాల్నో’ ఖైదీలకు జెప్పిన. వాళ్లుగూడ ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ అని నినాదాలిచ్చిర్రు.
2023 ఏప్రిల్ 17… తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా ‘రాజా వరప్రసాద్ రావు వనారస’ అని తొలిసారి సంతకం జేసి న. కేసీఆర్ ఏం జేసినా తెలంగాణ కోసమే జేసిం డు. నేను కేసీఆర్‌ను నమ్మిన. ఆయన బాట ల్నే నడిసిన. జై తెలంగాణ.
గడ్డం సతీష్
99590 59041