ఆడబిడ్డల ఆత్మగౌరవం బతుకమ్మ
పూలను పేర్చి.. పాటలను అల్లి.. ప్రకృతిని కొలిచే పండుగ బతుకమ్మ. తరతరాల తెలంగాణ జీవన సంస్కృతి, మహిళల ఐక్యత, ప్రకృతితో మనిషికున్న విడదీయరాని బంధానికి ఈ వేడుక ప్రతీక. తెలంగాణ సంస్కృతి అంటే గుర్తుకొచ్చే పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఏటా ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులపాటు పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ వలయాకారంగా చేరి ఆడిపాడుతూ మహిళలంతా కలిసి జరుపుకొనే ఈ వేడుక వెనుక ప్రకృతి ఆరాధన, కుటుంబ క్షేమం, సామూహిక జీవనం వంటి ఎన్నో ఇమిడి ఉన్నాయి. బతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించి ప్రాంతీయంగా భిన్నమైన కథనాలు, జానపద విశ్వాసాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవనంలో భాగమై తరతరాలుగా కొనసాగుతున్నది.
తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి కాలానుగుణంగా లభించే పూలతో బతుకమ్మను పేర్చడం ఈ పండుగలోని ప్రత్యేకత. ప్రకృతిలో సహజంగా లభించే పూలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా మనుషులు తమ చుట్టూ ఉన్న పర్యావరణంతో ఎంత సన్నిహితంగా ఉండేవారో ఈ సంప్రదాయం గుర్తుచేస్తుంది. చెరువులు, కుంటలు, పంటపొలాలు, గ్రామీణ జీవనంతో ముడిపడిన బతుకమ్మ.. ప్రకృతిని కేవలం వనరుగా కాకుండా జీవనాధారంగా చూడాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది.
ఎవరైనా దేవుళ్లను పూలతో కొలుస్తారు. కానీ పూలనే దేవతగా కొలిచే సంస్కృతి మన తెలంగాణకు ప్రత్యేక. అందుకే సంప్రదాయ పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానమున్నది. ఎంగిలిపూల బతుకమ్మగా మొదలై, సద్దుల బతుకమ్మ సంబురంగా ముగిసే తొమ్మిది రోజుల వైభవం మన సంస్కృతిని చాటి చెప్తుంది. చిన్నాపెద్ద ఆటపాటలతో ఊరూవాడా మారుమోగుతుంది. బతుకమ్మ పాటల్లో మహిళల జీవితానుభవాలు, కుటుంబ బంధాలు, పల్లె సంస్కృతి, సామాజిక పరిస్థితులు ప్రతిఫలిస్తాయి. ఒకచోట చేరి పాటలు పాడటం, ఆడటం ద్వారా మహిళలు తమ ఆనందాన్నే కాదు.. బాధలు, ఆశలు, ఆకాంక్షలను కూడా పంచుకుంటారు. అందుకే బతుకమ్మ కేవలం వినోదభరితమైన వేడుక కాదు. మహిళల ఐక్యత, వారి సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక.
తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ప్రజల ఐక్యత, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకు బతుకమ్మ వేడుక వేదికగా నిలిచింది. అయితే ఇలాంటి మహోన్నతమైన సంప్రదాయాన్ని కొనసాగించడం అంటే పూల పండుగను ఆడటంతోనే సరిపోదు. ఆచార వ్యవహారాల పోట్ల భక్తిశ్రద్ధలు చాటుకుంటూనే ప్రకృతి పట్ల మమేకాన్ని చాటిచెప్పుకోవాలి. ఇందులో భాగంగా చెరువులు కలుషితం కాకుండా చూడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, స్థానిక పూలను ప్రోత్సహించడం, ప్రకృతి వనరులను కాపాడటం కూడా మన బాధ్యత. పండుగలోని పర్యావరణ స్ఫూర్తి మన దైనందిన జీవితంలోనూ ప్రతిబింబించాలి. అదే సమయంలో బతుకమ్మ వేడుకల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం, పరిశుభ్రమైన ప్రదేశాలు, తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజం మీద ఉన్నది.
కాలం మారినా.. తరాలు మారినా.. బతుకమ్మ సౌరభ్యం తగ్గలేదు. ఎందుకంటే అది పూలతో పేర్చిన ఆకృతి మాత్రమే కాదు, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, ఆత్మగౌరవం, ప్రకృతి పట్ల ప్రేమ కలగలిసిన సజీవ సంస్కృతి. పూలను పేర్చినట్టే మనుషుల మధ్య అనుబంధాలను పేర్చి, పాటలను పాడినట్టే సమానత్వ స్వరాన్ని వినిపించాలి. బతుకమ్మను పూచించినట్టే ప్రకృతిని ఆరాధించాలి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. అప్పుడే బతుకమ్మ స్ఫూర్తి నిజమైన అర్థంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. బతుకమ్మ ప్రజల బతుకును పండించాలి.. ప్రకృతిని పరిరక్షించాలి.. మహిళల గౌరవాన్ని చాటాలి. అదే ఈ పూల పండుగ అందించే అసలైన సందేశం.
ఉద్యమనేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బతుకమ్మ, బోనాల ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించారు. ఏటా వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తద్వారా చేనేత కుటుంబాలకు కూడా ఏడాదంతా ఉపాధి అవకాశాలు కల్పించారు. సంస్కృతీ, సంప్రదాయా లను చాటి చెప్తూ, ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపర్చడం గొప్ప ఆదర్శం. కేసీఆర్ హయాంలో సాగిన మానవీయ పాలనకు ఇదొక నిదర్శనం. నేడు దేశవిదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా బతుకమ్మ పండుగను ఎంతో గొప్పగా జరుపుకొంటున్నారు. ఎన్నారైలు కూడా బతుకమ్మ విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నారు. లండన్‌లోని తెలంగాణ బిడ్డలు ‘టాక్ చేనేత తెలంగాణ-2026’ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పుట్టిన గడ్డ, చేనేత, బతుకమ్మ సంస్కృతి పట్ల అభిమానం చూపుతున్నారు. బతుకును కోరే గుణం తెలంగాణ నైజం. అలా మానవీయ సందేశంతో బతుకమ్మ ఖ్యాతి నిరంతరం ఉంటుంది. ‘జై తెలంగాణ’.
– (వ్యాసకర్త: కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్) తుల ఉమ
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

