న్యూఢిల్లీ : ఆరోగ్య సంరక్షణ రంగంలో పురుషుల కంటే స్త్రీలు 24 శాతం తక్కువ వేతనాలు పొందుతున్నారని, ఇతర రంగాలతో పోలిస్తే హెల్త్‌కేర్ రంగంలో ఈ వ్యత్యాసం అధికంగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐఎల్ఓ), ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఆరోగ్య రంగంలో వేతనాల విషయంలో లింగ వివక్షపై ఈ నివేదిక లోతైన విశ్లేషణ చేపట్టింది. లేబర్ మార్కెట్లలో పురుషులతో పోలిస్తే స్త్రీలకు తక్కువ వేతనాలు లభిస్తున్నాయని ఈ నివేదిక విస్పష్టంగా పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో 67 శాతం మహిళలే ఉన్నప్పటికీ వేతనాల్లో వారి వాటా తక్కువగా ఉండటానికి స్త్రీల పట్ల వివక్ష ప్రధాన కారణంగా ఈ నివేదిక ముందుకుతెచ్చింది. ఇతర ఆర్ధిక రంగాలతో పోలిస్తే హెల్త్ కేర్ రంగంలో వేతనాలు తక్కువగా ఉన్నాయని నివేదిక తేల్చిచెప్పింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన గత రెండేండ్లలోనూ హెల్త్‌కేర్ రంగంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం 2019, 2020లోనూ కొనసాగిందని, నామమాత్ర మెరుగుదలే కనిపించిందని ఈ నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.
హెల్త్ కేర్ రంగంలో అత్యధిక కార్మికులు మహిళలే ఉన్నా వారికి పురుషుల కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని వివక్షకు స్వస్తిపలికితేనే ఈ పరిస్ధితిలో మార్పు సాధ్యమని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ వర్క్‌ఫోర్స్ డైరెక్టర్ జిమ్ క్యాంప్‌బెల్ అన్నారు. వేతన వ్యత్యాసాన్ని చక్కదిద్దేలా ప్రభుత్వాలు, యాజమాన్యాలు, కార్మికులు నిర్ధిష్ట చర్యలతో చొరవ చూపాలని ఆయన సూచించారు.