నమ్ పెన్: హీరోగా ఖ్యాతిగాంచిన ఒక ఎలుక చనిపోయింది. దాని వయసు ఎనిమిదేండ్లు. దీంతో ఈ ఎలుక సేవలను గుర్తు చేసుకున్న ఆ సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. ఎలుక చచ్చిపోతే సంతాపమా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. ఇది సాదాసీదా ఎలుక కాదు. వందలాది మందుపాతరలను గుర్తించి ఎందరో ప్రాణాలను కాపాడింది మరి. ఆఫ్రికా జాతికి చెందిన ఈ భారీ ఎలుక హీరో పేరు మగావా. మందుపాతరలను పసిగట్టడంలో చాలా దిట్ట.
కంబోడియాకు చెందిన గనులు తొలగించే ప్రభుత్వేతర సంస్థ ఏపీఓపీవోకు, మగావా ఎనలేని సేవలందించింది. ఐదేండ్లుగా ఆ సంస్థ విధుల్లో భాగమైంది. అంతర్యుద్ధంలో భాగంగా భూమిలో పాతిన వందకుపైగా ల్యాండ్మైన్లు, ఇతర పేలుడు పదార్థాలను ఇది గుర్తించింది. దాదాపు 31 ఫుట్ బాల్ కోర్టులకు సమానమైన 2,25,000 చదరపు మీటర్ల భూమిని మందుపాతరల నుంచి క్లియర్ చేయడానికి ఎంతో సహకరించింది. 71 ల్యాండ్మైన్లు, 38 పేలని పేలుడు పదార్థాలను కనుగొన్నది. వాటికి బలి కాకుండా ఎందరో ప్రాణాలను ఇది కాపాడింది.
‘హీరో ర్యాట్’ మగావా సేవలకు గుర్తింపు కూడా లభించింది. బ్రిటన్‌కు చెందిన పీడీఎస్ఏ గోల్డ్ మెడల్‌ను పొందిన మొదటి ఎలుక కూడా ఇదే. ఇంతటి ఘన ఖ్యాతి గడించిన ‘హీరో ర్యాట్’ ముసలిదైంది. ఎనిమిది ఏండ్ల వయసులో అది చనిపోయింది. ఈ విషయాన్ని ఎంతో విచారంతో ఏపీఓపీవో తెలిపింది. ‘మేమంతా మగావాను కోల్పోయాం. అది చేసిన అద్భుతమైన పనికి కృతజ్ఞులం’ అంటూ ఏపీఓపీవో సంస్థ హృదయ పూర్వక నివాళి అర్పించింది. దీని సేవల వల్ల కంబోడియాలోని చాలా మంది ప్రజలు ప్రాణాలు లేదా అవయవాలు కోల్పోతామనే భయం లేకుండా జీవించారంటూ కొనియాడింది.
కాగా, హీరో ర్యాట్ మగావా ఈ వారాంతంలో శాంతియుతంగా మరణించిందని ఏపీఓపీవో సంస్థ తెలిపింది. మగావా ఇప్పటి వరకు మంచి ఆరోగ్యంతో ఉన్నదని, గత వారం వరకు ఉత్సాహంతో ఆడుకుంటూ ఉందని చెప్పింది. కానీ తన చివరి రోజులలో ఆహారంపై తక్కువ ఆసక్తి చూపిందని, వారాంతంలో ఎక్కువ సేపు నిద్రలోనే ఉన్నదని వెల్లడించింది. ‘మాగావా ఇటీవల నవంబర్‌లో తన పుట్టినరోజును జరుపుకున్నది. ఎనిమిది ఏండ్ల వృద్ధాప్యంలో అది చనిపోయింది’ అని సంతాప ప్రకటనలో పేర్కొంది.
ఈ భారీ హీరో ఎలుక 2016లో కంబోడియాకు వెళ్లడానికి ముందు టాంజానియాలో పుట్టి, శిక్షణ పొందింది. వాసనతో మందుపాతరలను పసిగట్టడంలో ఎంతో నైపుణ్యం, తెలివితేటలు, చురుకుదనం ప్రదర్శించింది. ల్యాండ్మైన్లను పేల్చలేనంత తేలికగా ఈ జాతి ఎలుకలు ఉంటాయి. దీంతో మందుపాతరలను గుర్తించడంలో వెలికి తీసేవారికి ఎంతో సహాయపడతాయి.
మరోవైపు, ప్రపంచంలోని అత్యంత భారీ ల్యాండ్‌మైన్ దేశాలలో కంబోడియా ఒకటి. ఇప్పటికీ 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూమి మందుపాతరలు, పేలుడు పదార్థాలతో నిండి ఉంది. ఈ మందుపాతరలు, పేలుడు పదార్థాల వల్ల ఎంతో మంది మరణించగా, 40,000 మందికి పైగా అవయవాలు కోల్పోయారు. దీంతో అత్యధిక తలసరి అంగవైకల్యం ప్రజలున్న దేశంగా కంబోడియా ఉన్నదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.