న్యూఢిల్లీ : రోజూ మూడు కప్పుల కాఫీతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కాఫీలో ఉండే కెఫైన్ శరీరంలో జీవక్రియలను 3 నుంచి 11 శాతం పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. రోజూ మూడు కప్పులకు మించకుండా పరిమిత మోతాదులో కాఫీ సేవిస్తే యుక్త వయసులో గుండె జబ్బులతో మరణించే ముప్పు 12 శాతం నివారించవచ్చని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయన నివేదిక తెలిపింది.
4,68,000 మంది ఎంఆర్ఐ స్కాన్లను పరిశీలించిన మీదట రోజూ మూడు కప్పుల కాఫీ సేవించే వారి గుండె ఆరోగ్యకరమైన పరిమాణంలో ఉండటంతో పాటు మెరుగ్గా పనిచేస్తున్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. కాఫీ ద్వారా చేకూరే ప్రయోజనాలు కేవలం గుండె ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తున్నట్టు వెల్లడైంది. కాఫీతో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గే ప్రక్రియ సులభతరమవుతుంది. టైప్ టూ మధుమేహ ముప్పును తగ్గించడం, క్యాన్సర్, అల్జీమర్స్ బారినపడే ముప్పులను నివారిస్తుందని వెల్లడైంది.