సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఐదేండ్ల బాలుడు తన తండ్రి ఫోన్ నుంచి రూ 64,900 విలువైన ఐస్‌క్రీంలు, కేక్‌లు ఆర్డర్ చేసి వాటిని తండ్రి కార్యాలయానికి రప్పించాడు. తండ్రి ఫోన్లో గేమ్ ఆడుతూ బాలుడు ఈ ఆర్డర్ చేశాడు. 14 జార్ల డుల్సి డీలిచె స్ర్పెడ్, ఏడు కేకులు, ఐదు మిల్క్ బాటిళ్లు, ఆరు ఐస్‌క్రీం బాక్సులను బాలుడు ఆర్డర్ చేశాడని సదరు కంపెనీ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది.
ఈ ఆర్డర్ బాలుడి తండ్రి ఆఫీస్‌లో డెలివరీ కావడంతో ఆయన షాక్ అయ్యాడు. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ అయిందని ఊబర్ ఈట్స్ నుంచి మెసేజ్ వచ్చేంతవరకూ బాలుడి తండ్రికి ఈ విషయం తెలియదు. ఆరోజు బాలుడి తండ్రి ఆఫీస్‌కు రాకపోయినా ఈ ఫుడ్‌ను తీసుకునేందుకు రావాల్సి వచ్చింది. ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే బాలుడి తండ్రి పుడ్‌ను సహోద్యోగులతో పంచుకున్నాడు.
మొత్తం ఆర్డర్‌కు వచ్చిన రసీదు బాలుడి కంటే పెద్దగా ఉండటంతో నెటిజన్లు అవాక్కయ్యారు. నేనైతే వారిని ఐస్‌క్రీం తినకుండా బ్యాన్ చేస్తానని ఓ యూజర్ కామెంట్ చేయగా బాలుడు మరోసారి ఇలాంటి పనిచేయకుండా అతడి తండ్రి తన ఫోన్ స్క్రీన్‌లాక్ మార్చుకోవాలని మరో యూజర్ సలహా ఇచ్చాడు.