TPAD : పుష్కర కాలంగా పడమటి నేల అమెరికాపై తెలుగు నేల పరిమళాలు వెదజల్లుతూ, తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తున్న ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్’ (టీపాడ్) తాజాగా ‘అడాప్ట్ ఎ హైవే’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు ప్రజలకే కాకుండా తమకు ఆశ్రయమిచ్చిన అమెరికా నేలకు సేవ చేయాలనే కర్తవ్య దృక్పథంతో.. స్టేట్ హైవే (SH 121)పై భద్రత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను భుజానికెత్తుకుంది.
‘అడాప్ట్ ఎ హైవే’ కార్యక్రమంలో భాగంగా.. ఫ్రిస్కో నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ఒకటైన ప్రెస్టన్ రోడ్‌ను, స్టేట్ హైవే నుంచి మెయిన్ స్ట్రీట్ వరకు రెండువైపులా రెండు మైళ్లకు పైగా విస్తరించిన రహదారిని దత్తత తీసుకుంది టీపాడ్. వాలంటీర్లతో రహదారికి ఇరువైపులా శుభ్రం చేయడమే కాకుండా రోడ్లను సురక్షితంగా మార్చడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టింది. రోడ్డు పక్కన, కాలిబాటలపై ఉండే చెత్త, ఇతర వ్యర్థాలు.. వంటివి బలమైన గాలులకు ఎగిరివచ్చి రహదారిపై పడినప్పుడు తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశముంది. పాదచారులకు, వాహనాల రాకపోకలకు ఇటువంటి వ్యర్థాలు ఆటంకం కలిగించకుండా.. ప్రమాదాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టంను నివారించేందుకే టీపాడ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

‘అడాప్ట్ ఎ హైవే’ పేరిట టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది టీపాడ్. ప్రతి మూడు నెలలకోసారి స్టేట్ హైవే 121 పక్కన, కాలిబాటలపై, పరిసరాల్లో పేరుకుపోయే చెత్త, వ్యర్థాలు, ఇతర వస్తువులను తొలగిస్తోందీ సంస్థ. టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రామ్ అన్నాడి సమన్వయం చేస్తున్న ఈ నూతన బాధ్యతకు ఫౌండేషన్ కమిటీ చెయిర్ రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ సభ్యులు రావు కల్వల, అజయ్ రెడ్డి, జానకీరామ్ మందాడి మార్గదర్శకత్వం చేయడంతో పాటు సహకారం అందిస్తున్నారు.
బీవోటీ చెయిర్ రవికాంత్ మామిడి నాయకత్వంలోని టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, కోఆర్డినేటర్ లింగారెడ్డి అల్వ, ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి నాయకత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వయిజరీ కమిటీ, కొలాబరేషన్ కమిటీ, టీపాడ్ వలంటీర్ల బృందం ఈ కార్యక్రమాన్ని సమిష్టి నిబద్ధతతో నిర్వహిస్తోంది. మూడోసారి హైవే క్లీనింగ్ యాక్టివిటీని చేపట్టిన టీపాడ్ తన 25 మంది వలంటీర్లతో ప్రెస్టన్ రోడ్డు పక్కన కాలిబాటలు, రోడ్డు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తతో పాటు పెద్ద పరిమాణంలోని వ్యర్థాలు, ఇతర వస్తువులను తొలగించారు.

ఇప్పటికే ‘బ్లడ్ డ్రైవ్’ ద్వారా రక్తం సేకరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు టీపాడ్ కృషి చేస్తోంది. ‘ఫుడ్ డ్రైవ్’ ద్వారా అన్నార్థుల ఆకలి తీర్చుతోంది. ఇప్పుడు ‘అడాప్ట్ ఎ హైవే’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత, ప్రయాణికుల రక్షణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతోందీ సంస్థ. ఈ సందర్భగా టీపాడ్ నాయకత్వం రవికాంత్ మామిడి(బీవోటీ చెయిర్), లక్ష్మి పోరెడ్డి(ప్రెసిడెంట్), రఘువీర్ బండారు (ఎఫ్‌సీ చెయిర్), లింగారెడ్డి అల్వ(కోఆర్డినేటర్) వలంటీర్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం ద్వారా సమాజానికి సేవ చేయాలని.. ఇతర కమ్యూనిటీ సంస్థలకు, ఫ్రెండ్స్ గ్రూప్స్‌కు టీపాడ్ నాయకత్వం పిలుపునిచ్చింది.