హైదరాబాద్ : అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి సజీవదహనం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్(BRS NRI Cell) గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గుప్తా(Mahesh Bigala) దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శనివారం న్యూజెర్సీ(New Jersey)లో రోడ్డు ప్రమాదం జరిగి భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్(21) అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన విచారకరమని మహేష్ బిగాల అన్నారు.
శైలేష్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇండియన్ కాన్సులేట్ అధికారులు, తానా సభ్యులు లక్ష్మి దేవి, చిట్టి బాబు, తెలంగాణ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారితో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. శైలేష్ మరణం కుటుంబ సభ్యులకే కాకుండా అందరిని కలిచి వేసిందని అన్నారు.
వారాంతం సెలవు దినం కావడంతో మృతదేహాన్ని పంపించే ఏర్పాట్లలో కొంత జాప్యం ఏర్పడుతుందని తెలిపారు. శైలేష్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Minister Vemula Prashant Reddy) సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. భీంగల్ ఎంపీపీ మహేశ్, సర్పంచ్ సంజీవ్‌తో సమన్వయం చేసుకుంటున్నామని మహేశ్ బిగాల వెల్లడించారు.