అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపైకి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా హాంకాంగ్ నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య) వ్యాఖ్యాతగా 19 జూన్ 2022 నాడు జరిగిన జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
నంది పురస్కార గ్రహీత, గీత రచయిత, ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డుల విజేత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలిసి ఏకతాటిపై వచ్చి ఘంటసాలకు భారతరత్న పురస్కార కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గురించి మాట్లాడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో అన్ని గీతాలను అత్యద్భుతంగా పాడటం వారికి చెల్లిందన్నారు. వందకుపైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. దేశభక్తి ప్రభోదించే గీతాలను ఆలపించడం, కుంతి విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు, జాషువా బాబాయ్ పాటలు, మనుషుల జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీతను అందించడం ఆయనకే సొంతమైందన్నారు. బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవించి, సంగీతం నేర్చుకొని సినీ పరిశ్రమలో ఓ ఎత్తుకు ఎదిగారని ప్రశంసించారు. ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
పాడుతా తీయగా గాయకుడు పార్థ నేమాని ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారతదేశం గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని చెబుతూ.. వారు మనల్ని విడిచి ఇన్ని సంవత్సరాలు అయినా మన మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తనకు బాగా పేరు తెచ్చిన పాడుతా తీయగా పాటను పాడి ప్రేక్షకులను అలరింపజేశారు.
చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి పాల్గొన్నారు. నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందించారు. మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివారాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru