హైదరాబాద్ : భారత జాతీయ జెండా(Indian National Flag) 102 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు అంతర్జాతీయ కళా , సాంస్కృతిక సంస్థలు ఆన్లైన్లో నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనం (International Poet Meet) విశేషంగా ఆకట్టుకుంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి -సింగపూర్, శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా కవి సమ్మేళనం నిర్వహించారు.
ఈ కవి సమ్మేళనాన్ని పింగళి వెంకయ్య(Pingali Venkaiah) మనుమడు జివియన్ నరసింహం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. 12 దేశాల నుంచి సుమారు 75 మంది కవులు, కవయిత్రులతో కవిసమ్మేళనం అద్వితీయంగా జరిగింది. భారత్ పాటు న్యూజిలాండ్(Newzealand), ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, యూకె, దక్షిణ ఆఫ్రికా, కెనడా(Canada), అమెరికా(America) దేశాల నుంచి కవులు పాల్గొని భారతదేశ జాతీయ సమైక్యత -విశిష్టత అనే అంశంపై కవితలు వినిపించారు.
వంగూరి ఫౌండేషన్(Vanguri Foundation) ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ నుంచి సాంస్కృతిక కళాసారథి(Samskruthika Kalasaradhi) వ్యవస్థాపకులు కవుటూరు రత్న కుమార్, వంశీ(Vamsi) వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు ఆన్లైన్లో మాట్లాడారు. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, కృష్ణవేణి సహ వ్యాఖ్యాతగా సహకరించారు.