Nizamabad | ఖలీల్ వాడి, సెప్టెంబర్ 29 : వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 29న నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్ ఘనంగా నిర్వహించారు. బైపాస్ చౌరస్తా నుంచి యెల్లమ్మగుట్టలోని మెడికవర్ హాస్పిటల్స్ వరకు ఈ వాక్‌థాన్ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సందీప్ రావు మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతీరోజూ నడక, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని సూచించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్ర బోస్ మాట్లాడుతూ గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్యులను సంప్రదించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ కే స్వామి, కార్డియాలజిస్టులు రవికిరణ్, వరీస్ అలీ, సతీష్, యూరాలజిస్ట్ కార్డియోథొరాసిక్ సర్జన్ రాకేష్, జగదీష్, ఇతర వైద్యులు, మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.