నిజామాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం ఎట్టకేలకు నియామకమైంది. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. యూనివర్సిటీలను బాగు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు నెలల తరబడి నిర్లక్ష్యం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం లేకపోవడంతో జవాబుదారీతనం లేకుండా పోయింది. వీసీ, రిజిస్ట్రార్ చర్యలకు పారదర్శకత లేకుండా పోవడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో? తెలియని దుస్థితి నెలకొంది. గందరగోళ నిర్ణయాల మూలంగా పరిపాలన గాడిలో పడకపోవడం, నిత్యం వివాదాలు తెరమీదకు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రిజిస్ట్రార్ తీసుకుంటున్న నిర్ణయాలను త్వరలోనే ఉన్నత స్థాయిలో సమీక్షించడంతో పాటుగా పాలకవర్గంతో ముకుతాడు వేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 1991లోని సెక్షన్ 18(1) అనుసరించి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడ్హక్ పాలకవర్గం కొనసాగుతుండగా వివిధ రంగాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించడంతో పాలకవర్గం ఉత్తేజితమైంది. సభ్యుల్లో ఒకరిద్ధరు కాంగ్రెస్ పార్టీ అనునయులు ఉండటం చర్చనీయాంశం అవుతోంది.
2024, ఫిబ్రవరిలో తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం గడువు ముగిసింది. ఈసీ గడువు తీరినప్పటికీ నియామక ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేదు. పాలకవర్గం నియామకానికి తీవ్ర జాప్యం చేశారు. ఉమ్మడి జిల్లా నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఇన్ని రోజుల పాటు తాత్సారం జరిగినట్లుగా తెలుస్తోంది. విద్యార్హతలు, ఇతరత్రా అనుభవాలు పక్కన పెట్టి అధికార పార్టీ నేతలు సూచించిన పేర్లను దాదాపుగా ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈసీ సభ్యుల నియామకంలో బోధన్ నియోజకవర్గానికి పెద్దపీట దక్కింది. కామారెడ్డి జిల్లా నుంచి ఒకరికి అవకాశం దక్కింది. షబ్బీర్ అలీ అనుంగ అనుచరుడికి చోటు కల్పించారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రస్తుతం సర్వం అధికారాలను గుప్పిట్లో పెట్టుకున్న ఓ కీలక వ్యక్తి నాలుగేళ్లుగా చక్రం తిప్పుతున్నాడు. ఈసీ మెంబర్లలో తన వారికి చోటు కల్పిస్తే భవిష్యత్తులో ఏ నిర్ణయానికైనా ఢోకా ఉండదన్న ధీమాలో సదరు కీలక ఆచార్యుడు పాచికలు వేసినప్పటికీ కుదరలేదని తెలుస్తోంది. టీయూ పాలకవర్గానికి ఛైర్మన్గా వైస్ ఛాన్సులర్ టి.యాదగిరి రావు కొనసాగుతారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్లతో పాటుగా మెంబర్ సెక్రటరీగా రిజిస్ట్రార్ ఉంటారు.