వర్ని, జూన్ 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపాటు తిమ్మాపూర్ ఆలయం, సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి వేల కోట్లు నిధులు కేసీఆర్ దయతోనే వచ్చాయని పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో బుధవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బాజిరెడ్డితోపాటు సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి తోట ఆగయ్య హాజరయ్యారు. సమాశానికి ముందు వర్ని మండల కేంద్రంలో నేతాజీ చౌరస్తా వద్ద బాజిరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఫంక్షన్హాలుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..బాన్సువాడ నియోజకవర్గ ప్రజల మనసు బీఆర్ఎస్లో ఉన్నదని, శరీరం మాత్రం కాంగ్రెస్‌లో ఉన్నదని చమత్కరించారు. కాంగ్రెస్ పాలనలో అధిక నిధులు వస్తాయని బీఆర్ఎస్ను వదిలి హస్తం పార్టీలోకి ఆశతో వెళ్లిన పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఆశ దోశ అప్పడంలా మారిందని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్లో లక్షీపుత్రుడు కాస్త కాంగ్రెస్‌లో దరిద్రపు పుత్రుడయ్యాడని విమర్శించారు.
బాన్సువాడ నియోజకవర్గానికి ఏది అడిగితే అది కేసీఆర్ ఇచ్చారని, నాలుగు నియోజకవర్గాలకు ఇచ్చే నిధులు ఒక్క బాన్సువాడకే ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పొట్టగొట్టి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లారని, ప్రజలకు ఆయన కుటుంబం మీద విసుగొచ్చిందని అన్నారు. బాన్సువాడలో ఈసారి బీఆర్ఎస్ తరపున ఎవరు నిలుచున్నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పార్టీలో ఒకరినొకరు గౌరవించుకోవాలని, అప్పుడే పార్టీ గౌరవం పెరుగుతుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవారు, కేసీఆర్ అభిమానులు ప్రతి ఇంట్లో ఉన్నారని తెలిపారు.
ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు తోడు దొంగలేనని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని, రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచలి శ్రీనివాసరావు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, రత్నకుమార్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ఏజాజ్, దాసు, కుంకుమ దత్తు, ఆనంద్, గుజ్జ అశోక్, ఆసీఫ్, గైని లక్ష్మణ్, జీషాన్, ప్రవీణ్ యాదవ్, ప్రభాకర్, మహేందర్ రెడ్డి, వీరప్ప, ఉస్మాన్, నరెడ్ల శ్రీను, రాజేశ్, గణేశ్‌తోపాటు వర్ని, చందూర్, మోస్రా మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పిడికెడు మందితో పార్టీని ప్రారంభించి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్కు పోచారం తీరని ద్రోహం చేశారు. పోచారాన్ని పార్టీలోకి తిరిగి తీసుకునే పరిస్థితిలేదు. లిఫ్టు ఇరిగేషన్ మంజూరు చేసి నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బాన్సువాడ నియోజకవర్గంలో 12 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. దీంతోపాటు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక్క అభివృద్ధి పనిలేదు.రైతుబంధు, పింఛన్ సమయానికి అందించిన కేసీఆర్‌ను ప్రజలందరూ తలచుకుంటున్నారు. 450 సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘతన కేసీఆర్‌కే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి, విశ్వాసం కోల్పోయింది. రాబోయే ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కీలకం. కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలి. గతంలో జరిగిన సభ్యత్వ నమోదు కన్నా ఎక్కువమందిని చేయించి బాన్సువాడ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలి. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. కార్యకర్తలకు అండగా ఉంటాం.
– వీజీ గౌడ్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి
ఒక్కో బీఆర్ఎస్ కార్యకర్త వెయ్యి మందితో సమానం. ప్రస్తుతం రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి 90శాతం పూర్తయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రిజర్వాయర్, ఎత్తిపోతల పనులు మొదలు పెట్టారు. జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాలు రైతులకు కేసీఆర్ అందించిన వరాలు. ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి. బాన్సువాడ నియోజకవర్గానికి పట్టిన చీడ పీడ అయిన పోచారాన్ని ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. ఎస్ఐఆర్ కార్యక్రమంలో మనవంతు బాధ్యతగా పని చేయాలి. ఓట్ల తొలగింపులో అధికారులు పనులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా పరిశీలించాల్సిన బాధ్యత మనపైన ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను పాతరేసి పోచారం శ్రీనివాసరెడ్డిని నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలి.
– తోట ఆగయ్య, సభ్యత్వ నమోదు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి