CP P Sai Chaitanya | వినాయకనగర్, జులై 7: మహిళా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్నినిజామాబాద్ సీపీ పీ సాయి చైతన్య అన్నారు. మహిళా పోలీసు సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ ఇప్పించేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని సీపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి తో పాటు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, భవిష్యత్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర్చుకునేందుకు శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళలు తెలుసుకోవాల్సిన నూతన స్కిల్స్, టెక్నీక్స్ జాగ్రత్తలు, మహిళలకు తమపై తమకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి కావాల్సిన మెలకువలను ఈ శిక్షణలో సిబ్బందికి నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రతీ మహిళా సిబ్బంది తీసుకోవాల్సిన జగ్రతలను వివరించారు. కావున వారం పాటు నిర్వహించే ఈ శిక్షణను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలో పీఈటీలు, పీడీలు, రెజ్లింగ్, జూడోలో జాతీయ పతకాలు సాధించిన టీచర్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ రామ చందర్ రావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్, శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్లకు చెందిన సంతోషి, అనిత, రజనీ తదితరులు పాల్గొన్నారు.