Kotagiri | కోటగిరి, ఏప్రిల్ 25 : అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశమని కోటగిరి ఐసిడిఎస్ సెక్టార్ సూపర్ వైజర్ కొమురవ్వ, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బ్రామన్ గల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ అంగన్వాడి కేంద్రాల్లో ప్రతీ నెల 19వ తేదీన ECCE దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పిల్లల శారీరక మానసిక భాష సాంఘిక, మేధో వికాసాన్ని ప్రోత్సహించడం, తల్లిదండ్రులను అంగన్వాడీ కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం, వారి పిల్లల పురోగతిని వారికి వివరించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. పిల్లల ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ దినోత్సవంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పాటలు కథలు, ఆటలు, చిత్రలేఖనం వంటి కృత్యాలను నిర్వహించి వారిలో సృజనాత్మకతను పెంపొదిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముజాఫర్ బేగ్, అంగన్వాడీ టీచర్లు కట్టు కృష్ణకుమారి, పొమ్మేడి సావిత్రి, జమున, విజయలక్ష్మి, సాయమ్మ, గంగామణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.