నిజామాబాద్ లీగల్, జూన్ 28: సీఎం కేసీఆర్ రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. అదునుకు డబ్బులు అందడంతో వానకాలం సాగుకు రైతన్న సంబురంగా ముందుకు కదులుతున్నాడు. మూడో రోజు బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు పడ్డాయి. సమైక్య పాలనలో వ్యవసాయమంటే రైతులు అరిగోస పడేది… స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలతో వ్యవసాయమంటే రైతులంతా సంతోషపడేలా చేశారు. పెట్టుబడి కోసం సేట్లు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితిని రూపుమాపారు. అప్పుల రంది తగ్గించి.. ఆనందంగా ఎవుసం చేసుకునేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రైతులు చేతులెత్తి మొక్కుతున్నారు. రైతు క్షేమం కోరే ప్రభుత్వమే మళ్లీ రావాలని, వచ్చేలా చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
సేట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది..
బాన్సువాడ టౌన్, జూన్ 28: రైతుబంధు అందించక ముందు పంట పెట్టుబడి డబ్బుల కోసం సేట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని పంట వేయాల్సి వచ్చేది. రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులెవ్వరూ ఇబ్బంది పడకుండా పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం తీసుకొచ్చారు. పంట సాగుజేసే టైంకు మా ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పంట వేస్తున్నాం.
– ప్రతిమారెడ్డి, రైతు, బాన్సువాడ
వడ్డీకి తెచ్చుకునుడు బందైంది..
బాన్సువాడ టౌన్, జూన్ 28: నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు కింద ప్రతి సీజన్లో పంటను వేసే సమయానికి ఎకరానికి రూ.5వేలు అందిస్తుండడంతో పెట్టుబడికి ఇబ్బంది తప్పింది. మునుపు పంట వేసేందుకు ముందు పొలం దున్నడానికి, విత్తనాలు కొనడానికి తెలిసిన వాళ్ల దగ్గర ఏదైనా వస్తువు తాకట్టు పెట్టి వడ్డీకి పైసలు తెచ్చుకు నేటోళ్లం. కేసీఆర్ పుణ్యమా అని వడ్డీకి తెచ్చుకోవడం బందైంది.
– ముర్రగళ్ల గంగయ్య, బాన్సువాడ
కేసీఆర్ రైతుల పాలిట దేవుడు
బాన్సువాడ టౌన్, జూన్ 28: సీఎం కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. వానకాలం, యాసంగిలో రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నాడు. సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నాం. సమయానికి డబ్బులు పడడంతో పెట్టుబడికి ఇక్కట్లు తప్పాయి. నా జీవితంలో సీఎం కేసీఆర్ సారును ఎప్పుడూ మరిచిపోను.
– దుద్దాల భారతి, రైతు, బాన్సువాడ
సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నం..
బీర్కూర్: పంట సాగు సమయంలో రైతుబంధు డబ్బులు జమ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. గతంలో సీజన్ వచ్చిందంటే పైసల కోసం ఇబ్బందిపడేవాళ్లం. అప్పు చేసేందుకు ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక సతమతమయ్యేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా సంతోషంగా పంటపొలాల్లో వ్యవసాయ పనులను చేసుకోగలుగుతున్నాం. సీఎం కేసీఆర్ సార్ ఉన్నంత వరకు మా రైతులకు ఏ ఇబ్బంది లేదు.
– నాగేశ్వర్రావు, రైతు, బీర్కూర్
పెట్టుబడికి ఢోకాలేదు..
నాగిరెడ్డిపేట్, జూన్ 28: సమయానికి పంట పెట్టుబడి సాయం వస్తున్నది. పెట్టుబడి కోసం అప్పులు చేసే రోజులు పోయాయి. సమయానికి రైతుబంధు డబ్బులు ఇస్తూ మమ్మల్ని ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– రవికిశోర్, గోపాల్పేట్
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
బీర్కూర్, జూన్ 28: వానకాలం ప్రారంభం కావడంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమచేసింది. పంట పెట్టుబడికి సరైన సమయంలో డబ్బు అందింది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాల ఖర్చులకు ఎలాంటి బాధలు లేకుండా పోయాయి. రైతుగోసను అర్థం చేసుకొని ఇబ్బందులు తీరుస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– ఉప్పలపాటి సత్యనారాయణ, రైతు, తిమ్మాపూర్
యువకులు ఎవుసం చేస్తుండ్రు..
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు పథకంతో చాలా మంది యువకులు వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రైతే రాజు అన్న నానుడిని సీఎం కేసీఆర్ నిజం చేసి చూపుతున్నారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకొని, వాటిని పరిష్కరించే దిశగా చేస్తున్న ప్రణాళికలు అమోఘం. రైతుల కష్టాలు తీరుస్తున్న సీఎం సార్‌కు కృతజ్ఞతలు.
– హరికృష్ణ, రైతు, ప్రకాశ్‌రావు క్యాంపు, బీర్కూర్