పేదరికం..పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకొని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనేది నాగరాణి ఆలోచన. ఈ నేపథ్యంలో వికలాంగుల కల్యాణ వేదిక సంస్థతోపాటు గోల్కొండ క్రాప్ట్ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మగ్గం, కుట్టుమిషన్, జ్యూట్ బ్యాగుల శిక్షణ ఆమెకు తోడుగా నిలిచింది. ముందుగా శిక్షణ పూర్తి చేసుకొని, నెలనెలా ఉపాధి పొందుతున్నది. ఇలా నాగరాణితోపాటు అనేక మంది మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఉపాధిమార్గాలుగా నిలిచాయి.
కోటగిరి, డిసెంబర్ 20: మారుతున్న సమాజంలో పెరిగిపోతున్న ఖర్చులు.. కుటుంబాలకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో.. స్వయం ఉపాధి కోసం ఇచ్చే శిక్షణలు మహిళలకు తోడుగా, అండగా నిలుస్తున్నాయి. తమకాళ్లపై తాము నిలబడేలా వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది మహిళలు ఆయా రంగాల్లో శిక్షణ పొందుతూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు.
ఆయా రంగాల్లో శిక్షణలు..
భర్త సంపాదనకు తోడుగా.. తల్లిదండ్రులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో మహిళలకు పలు సంస్థలు అందిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలు తోడుగా.. అండగా నిలుస్తున్నాయి. ఇంటిల్లిపాది ఏదో ఒక పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. వీరికి స్వ యం ఉపాధి పొందేలా పలు సంస్థలు శిక్షణ,సహకారం అందిస్తున్నాయి. ప్రధానంగా కుట్టుశిక్షణ,జ్యూట్‌బ్యాగుల తయారీ, మగ్గం, బ్యుటీషియన్ తదితర రంగాల్లో ఆయా సంస్థలు మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. 40 రోజుల నుంచి నాలుగు నెలల వరకు వివిధ రంగాల్లో శిక్షణనిస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఆ వైపు మొగ్గు చూపుతున్నారు. వికలాంగుల కల్యాణ వేదిక సంస్థ జనరల్ సెక్రటరీ సుభాష్ గుప్తా ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నప్పటికీ మరికొన్ని సంస్థలు కొంత నగదును తీసుకొని శిక్షణ ఇస్తున్నాయి.
స్వయం ఉపాధి వైపు అడుగులు
ఒకప్పుడు ఏడాదికి రూ.3వేల వరకు తమ బ్లౌజ్‌లు కుట్టించేందుకు వెచ్చించిన మహిళలు. నేడు శిక్షణ పొంది సొంతంగా ఇంటి వద్దనే టైలరింగ్, మగ్గం, బ్యుటీషియన్,జూట్ బ్యాగుల తయారీతోపాటు పలు రంగాలకు చెందిన పనులను చేసుకుంటున్నారు.
నెలకు 200 మందికిపైగా శిక్షణ
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంతోపాటు వివిధ మండలాల్లో పలు స్వచ్ఛంద సంస్థ, ప్రైవేట్ సంస్థలు మహిళలకు పలు రంగాల్లో శిక్షణనిస్తున్నాయి. ఆయా సంస్థల్లో నెలకు 200 మందికిపైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఎక్కువ మంది కుట్టు శిక్షణపై ఆసక్తి చూపుతున్నారు. మరికొంత మంది మహిళలు మగ్గం, బ్యుటీషియన్ రంగంవైపు మొగ్గుచూపుతుండగా ప్లాస్టిక్ నివారణలో తాము సైతం భాగస్వాములు కావడానికి జ్యూట్ బ్యాగుల తయారీని నేర్చుకుంటున్నారు. వీరు త్వరితగతిన మెళకువలు నేర్చుకునేలా ఆయా సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి.
పైసా ఖర్చు లేకుండా శిక్షణ..
30 రోజుల పాటు పైసా ఖర్చు లేకుండా మంచిగా నేర్పిస్తున్నారు. శిక్షణకు సంబంధించి పూర్తిస్థాయిలో సాయం అందజేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మగ్గం నేర్చుకుంటున్నాం. శిక్షణ తర్వాత ఇంటి వద్ద కూర్చొని మగ్గం, కుట్టుమిషన్ ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పించిన వికలాంగుల కల్యాణ వేదికకు కృతజ్ఞతలు.
– కవిత, కోటగిరి
కుటుంబానికి తోడుగా ఉంటుందని..
గతంలో ఇంట్లో ఒకరు పని చేస్తే కుటుంబం మొత్తానికి సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో ఎందరు ఉన్నా అందరూ పనిచేస్తేనే నడుస్తున్నది. అందుకోసమే నేను కుట్టుమిషన్ నేర్చుకున్నా. ప్రస్తుతం వికలాంగుల కల్యాణ వేదిక ఆధ్వర్యంలో మగ్గం నేర్చుకుంటున్నా. శిక్షణ పొందిన తర్వాత ఇంటి వద్ద సైతం కుట్టుకుంటున్న. చిల్లర ఖర్చులకు ఉపయోగపడుతున్నది.
-యం. విజయ,కోటగిరి
నేర్చుకొని..శిక్షణ ఇస్తున్నా..
నేను ఎనిమిదేండ్ల క్రితం నేర్చుకున్న.. ప్రస్తుతం ఇతర మహిళలకు శిక్షణ ఇస్తున్నా.. ఇంతకు ముందు గోల్కొండ క్రాప్ట్ సంస్థ ద్వారా నాలుగు నెలల పాటు బంజారా ఎంబ్రాయిడరీ(మగ్గం) కుట్టు శిక్షణ,అల్లికలపై శిక్షణ ఇచ్చాను. ఇంటి వద్ద సైతం మరికొంత మందికి శిక్షణ ఇస్తుంటాను. ప్రస్తుతం కోటగిరిలో వికలాంగుల కల్యాణ వేదిక సంస్థ ఆధ్వర్యలో 40 రోజుల శిక్షణలో భాగంగా రోజుకు 30 మంది మహిళలకు మగ్గం శిక్షణ ఇస్తున్నా. ఒకప్పుడు గృహిణిగా ఉన్న నాకు ఈ శిక్షణతో సంపాదించే స్థాయికి ఎదిగా. ఇప్పుడు నెలకు రూ.10 వేల వరకు సంపాదిస్తున్నా. ఈ సంపాదన నా కుటుంబానికి ఎంతో అండగా ఉంటున్నది.
– నాగరాణి, ట్రైనర్, బోధన్
ఎంతో మేలు చేస్తున్నది..
ఉచిత శిక్షణ మాలాం టి మహిళలకు ఎంతో మేలు చేస్తున్నది. నేను శిక్షణ పొంది కొత్త కుట్టుమిషన్ కొన్నా. గతంలో బయట కుట్టుకు ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇంట్లోనే కుట్టుకుంటున్న. డబ్బులు కూడా ఆదా అవుతున్నవి. జ్యూట్ బ్యాగులు, బ్లౌజ్‌లు ఇతరాత్ర కుట్టడం నేర్చుకున్న. ఇట్ల శిక్షణ ఇవ్వడం మేము సంపాదించేందుకు ఉపయోగపడుతున్నది.
– వైష్ణవి, కోటగిరి