ఖలీల్‌వాడి, ఏప్రిల్ 12 : జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడ ఉన్నదో ఎంపీ అర్వింద్ చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నేమ్ ప్లేట్ నిజామాబాద్‌లో, పసుపు బోర్డు ఆఫీస్ ఢిల్లీలో ఉన్నదని ఎద్దేవా చేశారు. ఎంపీ అర్వింద్ పెద్ద రాబంధు అని ఒక ప్రకటనలో విమర్శించారు. అర్వింద్ జిల్లాకు పట్టిన శని అని, పెద్ద అవినీతి గని అని ధ్వజమెత్తారు. అబద్ధాలకు అరవింద్ నిలువెత్తు అద్దమని పేర్కొన్నారు.
పదవుల కోసం రంగులు మార్చే ఊసరవెల్లితో సమానమని మండిపడ్డారు. ఎంపీగా జిల్లా అభివృద్ధికి నయా పైసా తెచ్చారా అని ప్రశ్నించారు. అర్వింద్ రైతు ద్రోహి అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అర్వింద్ కుటుంబం ఎక్కడ ఉన్నదని నిలదీశారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి డబ్బులు దండుకుంటూ, సీమాంధ్రుల పంచన చేరి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయిన చరిత్ర డీఎస్ కుటుంబానిదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మౌత్ స్పీకర్‌గా మారిన అర్వింద్, పదేపదే కేసీఆర్ ఫాం హౌస్ గురించి మాట్లాడడం సిగ్గుటన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై నోరెత్తని బీజేపీ నేతలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఒక్క రోజైనా బీజేపీ నాయకులు పోరాడారా ? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ది ఉద్యమ కుటుంబమని, అర్వింద్‌ది అవినీతి ఫ్యామిలీ అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత కాలిగోటికి సరిపోరని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ తెచ్చిన మనిషి అని కూడా చూడకుండా, ఆయన వయస్సుకు గౌరవం ఇవ్వకుండా బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గల్లీ లీడర్ల కన్నా అధ్వాన్నంగా తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఎందుకు విషం కక్కుతున్నావని, తెలంగాణ తెచ్చినందుకా ? తెలంగాణకు అన్ని విధాల అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ను తిడుతున్నావా అని ప్రశ్నించారు. ఆయన భాష ఇలాగే కొనసాగితే జిల్లా ప్రజలే అర్వింద్ నాలుకను చీరేస్తారని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తిట్లతో ప్రజల దృష్టిని మళ్లించలేరన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం
హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్రపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పల్లకి మోస్తున్న బీజేపీ ఎంపీలు ఒక్కనాడైనా తెలంగాణ కోసం ఢిల్లీలో గళమెత్త లేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వకుండా మొండిచేయి చూపినప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకమని, ఆ పార్టీలకు తెలంగాణ సోయి లేదన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.