నిజాంసాగర్, ఆగస్టు 11: మహ్మద్‌నగర్ మండలంలోని సింగీతం గ్రామశివారులో వాగుపై వంతెన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బిల్లుల చెల్లింపులో అంతులేని జాప్యం నెలకొనడంతో మూడేండ్లుగా పనులు ముందుకు సాగడంలేదు. రూ.4.8 కోట్లతో మంజూరైన హైలెవల్ వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోవడంతో సింగీతం రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వాగు దాటలేక సాగు పనులు, రాకపోకలు స్తంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన పనులు వెంటనే పూర్తిచేయాలని కోరుతున్నారు. మహ్మద్‌నగర్ మండలంలోని సింగీతం గ్రామ శివారులో వాగుపైన హైలెవల్ వంతెన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 2023లో రూ.4.8 కోట్లు మంజూరు చేసింది. పనులు వెంటనే ప్రారంభించి, పిల్లర్ల నిర్మాణంతోపాటు వాగుకు దిమ్మెల నిర్మాణాలు పూర్తిచేశారు. కానీ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో జాప్యం నెలకొనడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశాడు.
వాగు దాటి అవతల ఒడ్డున నర్సాపూరం, రాఘవపల్లి, రంగాపురం శివారుల్లో 800 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగు దాటి వెళ్లడం, వరద ప్రవాహంలో చిక్కుకోవడం, ప్రాణాలను ఫణంగా పెట్టి పంటలను సాగు చేసే పరిస్థితి నెలకొన్నది. వాగుపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరై, మూడేండ్ల క్రితం ప్రారంభించిన పనులు ఇంతవరకూ పూర్తికాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వాగులో నీటి ప్రవాహం ఉండడంతో తెప్పలపై తాడు సాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించి సింగీతం గ్రామ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలి. కొన్నేండ్లుగా వంతెన కోసం ఎదురు చూశారు. చివరకు వంతెన పనులు ప్రారంభించగానే సంతోషం కలిగింది. తీరా పనులు ప్రారంభించి మూడేండ్లు గడిచినా ఇప్పటివరకూ పనులు పూర్తికాలేదు. మా కష్టాలు అలాగే ఉన్నాయి.
-అట్కుల హన్మంత్‌రెడ్డి
సింగీతం వాగుపై వంతెన నిర్మాణ పనులు మూడేండ్ల క్రితం చేపట్టారు. ఇప్పటివరకూ పనులు పూర్తిచేయకపోవడంతో వానకాలం పంటల సాగు గగనంగా మారింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో అవతలి వైపు పొలాలకు వెళ్లాలంటే వాగులో వరద రావడం, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి పొలాల్లోనే ఉంటున్నాం. ఎరువులు, పురుగు మందులు సైతం అందించని పరిస్థితి. ఇప్పటికైనా పాలకులు స్పందించి పనులు పూర్తి చేయించాలి.
-గువ్వ మొగులయ్య