బోధన్, మార్చి 12: జిల్లాలో ఎక్కడైనా సాగునీటి సమస్య తలెత్తితే.. సంబంధిత అధికారులదే బాధ్యత అని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. విధుల్లో అలసత్వం వీడాలని, సాగునీటి సరఫరాను పర్యవేక్షించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని నీటిపారుదలశాఖ గెస్ట్‌హౌస్‌లో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని పలు నీటి వనరుల కింద ఆయకట్టు పంటల పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నీటి వనరులు అధికంగా ఉన్నాయని, ఎక్కడ కూడా సాగునీటి సమస్య ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆయకట్టు ఎగువ ప్రాంతాల్లో నీటి చౌర్యం జరుగకుండా చూడాలని, చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం పంటలకు సాగునీటి అవసరం ఎక్కువగా ఉన్నదని, నెలన్నర రోజులపాటు ప్రత్యేక దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. గతేడాది జిల్లాలో 63వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా.. ఈసారి 77వేల మెట్రిక్ టన్నులకు డిమాండ్ పెరిగిందన్నారు. డిమాండ్‌ను దృష్టికి ఉంచుకొని తగినన్ని ఎరువులను తెప్పించి స్టాక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆ శాఖఅధికారులను ఆదేశించారు.