ఉరుకుల పరుగుల జీవితంలో పెంపుడు జంతువులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా కుక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. యజమానుల ప్రేమాభిమానాలతో శునకాలు రాజ‘భౌ’గాలను అనుభవిస్తున్నాయి.
-మోర్తాడ్/కమ్మర్పల్లి/బోధన్, నమస్తే తెలంగాణ 24
విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి దాన్ని సాకితే చాలు.. కష్టకాలంలో కూడా అది మన వెంటే ఉంటుంది. అందుకే ఎంతో మంది కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే కొందరు ఇంటికి కాపలా కోసం పెంచుకుంటుండగా, మరికొందరు ఇష్టంతో పెంచుకుంటారు. గతంలో పట్టణాలకే పరిమితమైన పెట్ కల్చర్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నది. కుక్కల పెంపకంపై గ్రామీణులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పలు దేశాలకు చెందిన కుక్కలు సందడి చేస్తున్నాయి. యజమానులు వాటిని ఎంతో ఖర్చుతో కొనుగోలు చేసి మరీ గారాబంగా చూసుకుంటున్నారు. ప్రత్యేకమైన ఆహారం, షాంపూలతో స్నానం చేయించడం, వివిధ ఆకృతుల్లో కటింగ్ చేయడం, దవాఖానలకు తీసుకెళ్లడం లాంటివి చేస్తుండడంతో.. కుక్కలు రాజభోగాలను అనుభవిస్తున్నాయి.
విశ్వాసానికి మారుపేరు కుక్క అని అందరికీ తెలిసిందే. మూడు రోజుల పాటు అన్నం పెడితే ఎలాంటి కుక్క అయినా మనవెంటే తిరుగుతుంది. అంతటి విశ్వాసంగా బతికే జీవి పట్ల మానవులు సైతం పరితపిస్తున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన కుక్కల పెంపకం.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరింది. ఏ ఇంటికి వెళ్లినా ఏదో రకం కుక్క అగుపిస్తుంది. పెంచుకుంటున్న కుక్కను తమ కుటుంబంలో భాగం చేసుకుంటున్నారు.
ట్రెండ్ మారింది…
పట్టణాల్లో మాత్రమే ఖరీదైన ఇండ్లలో గేట్లకు బీ వేర్ ఆఫ్ డాగ్ అని రాసి ఉండేది. కానీ ప్రస్తుతం గ్రామాల్లో మాత్రం బోర్డులు కనిపించకపోయినా.. ఇండ్లలో కుక్కలు మాత్రం కనిపిస్తున్నాయి. కుక్కలను పెంచుకోవాలన్న ఆసక్తి పెరగడమే అందుకు ప్రధాన కారణం. ఇంటికి కాపలాగా ఉండే కుక్కలు ప్రస్తుతం కుటుంబసభ్యులుగా మారిపోయాయి. ఎక్కడికి వెళ్లినా కుక్కను వెంటబెట్టుకొని వెళ్లడం.. లేదంటే సమయానికి ఇంటికి చేరుకోవడం చేస్తున్నారు. పెంచుకుంటున్న కుక్కలు ఇంటికి కాపలాగా.. గ్రామీణ ప్రాంతాల్లో కోతులు ఇండ్లలోకి రాకుండా చేస్తున్నాయి.
ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాం..వేల్పూర్ : మా ఇంట్లో సభ్యురాలిగా కుక్కను (పమేరియన్ జాతి) పెంచుకుంటున్నాం. దీనిని రూ.20వేలు పెట్టి కరీంనగర్ నుంచి కొనుక్కొని వచ్చాం. నెలకు సుమారు రూ.5వేలు ఖర్చు అవుతుంది. ముద్దుగా పప్పి అని పిలుస్తాం. రాత్రి వేళల్లో ఇంటి వద్దకు
ఎవరినీ రానివ్వదు.
– శకుంతల, వేల్పూర్
మనిషి కన్నా విశ్వాసమైనది..
ముప్కాల్ : శునకాలకు ఉన్నంత విశ్వాసం ఎవరికీ ఉండదు. అందుకే వాటి విలువ లెక్కకట్టవద్దు. నా దగ్గర జర్మన్ షెఫర్డ్ ఉంది. దాని ముద్దు పేరు(హర్షి). దాని ఆరోగ్యం కోసం నెలకు రూ.1500 నుంచి రూ.2000 ఖర్చు అవుతుంది. ఇంజెక్షన్లు, ప్రత్యేక షాంపును వాడుతున్నాం. మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ప్రేమగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ అది అంటే చాలా ఇష్టం.
– గంగాధర్, ముప్కాల్
మా ఇంట్లో ఒకరిగా..
భీమ్‌గల్: రెండు సంవత్సరాలుగా గోల్డెన్ రిట్రీవర్ అనే అమెరికన్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి రూ. 25వేలు పెట్టి తీసుకొచ్చాం. ప్రతి నెల సుమారు రూ.4వేలు ఖర్చు అవుతుంది. దీనికి ప్రతిరోజు ఆహారంగా పెరుగన్నం, ఉడకబెట్టిన చికెన్ అన్నం, కాల్షియం బోన్స్‌ను అందిస్తున్నాం. ఇది మా ఇంట్లో వ్యక్తిగా అయ్యింది.
– మంచిర్యాల రమేశ్, భీమ్‌గల్
కుక్కలంటే చాలా ఇష్టం..
కుక్కలంటే నాకు చాలా ఇష్టం. నేను హైదరాబాద్ నుంచి జపాన్ షెఫర్డు కుక్కను రూ.40వేలు పెట్టి తెచ్చుకున్నాను. దానికి కావాల్సిన మెడిసిన్, ఫుడ్ అంతా ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్నాను. కుక్కకు కావాల్సిన ఫుడ్‌ను అన్ని రకాల మందులను ఇంట్లో స్టాక్‌గా ఉంచుకుంటాను. నెలకు రూ.5వేల వరకు కుక్క కోసం ఖర్చుచేస్తున్నాను.
– రుత్విక్, కమ్మర్పల్లి
మా కుటుంబంలో అందరికీ ఇష్టం
మేము రూ.15వేలు పెట్టి లాబ్రడార్ కుక్కను మూడేండ్ల కింద తెచ్చుకున్నాం. దానికి లియో అని పేరు పెట్టుకున్నాం. ఇంటి సభ్యులందరికీ లియో అంటే ఎంతో ఇష్టం. దీనికి నెలకు దాదాపు రూ.3వేల వరకు ఖర్చు చేస్తున్నాం.
– భోగ లక్ష్మణ్, మోర్తాడ్
స్నేహంగా ఉంటుంది..
మేము కొత్త ఇంటిని కట్టుకున్న తర్వాత మా డాడీ.. లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను తీసుకొచ్చారు. దాంతో అనుబంధం పెరిగి ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్లా ఫీలవుతాము. మాతో స్నేహంగా ఉంటుంది. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకం మాతో ఉండడం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నది.
– రోహిత్‌రెడ్డి, కమ్మర్పల్లి.
మెయింటెనెన్స్‌కు వేల ఖర్చు..
కుక్కలను పెంచుకుంటున్న వారు వాటి మెయింటెనెన్స్‌కు వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్కరు వారి ఆదాయాన్ని బట్టి నెలకు రూ.2వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేస్తున్నారు. రోజూ ఇచ్చే ఫుడ్, ఇంజెక్షన్లు, మందుల ఖర్చులు ఇలా ఆదాయాన్ని బట్టి వాటికి ఖర్చు చేస్తున్నారు.
పుట్టినరోజులు, బారసాలలు..
పెంచుకుంటున్న కుక్కలకు పుట్టిన రోజులు, బారసాలలు కూడా ఇండ్లలో జరుపుతున్నారంటే కుక్కల విషయంలో ఎంత ప్రాధాన్యత పెరిగిందో తెలుస్తుంది. ఇవే కాకుండా కుక్కలు అనారోగ్యానికి గురైతే దవాఖానలకు తిప్పడం, హైదరాబాద్ వరకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక వేల కుక్క మరణిస్తే ఆ ఇళ్లంతా చిన్నబోయి, ఇంట్లో మనిషిని కోల్పోయిన పరిస్థితి నెలకొంటున్నది. చనిపోయిన కుక్క ను ఖననం కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది కుక్కలు చూపే విశ్వాసానికి మనుషులు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో..
ఒక్కోటి ఒక్కో ధర..
సాధారణంగా ఇండ్లలో పెంచుకునే కుక్కలు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో జాతిని బట్టి ధరను పెట్టి కొనుగోలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచి గ్రామాల కుక్కలను కొని తెచ్చుకుంటున్నారు. కార్సన్ రకం రూ.60వేల నుంచి ధర ప్రారంభమవుతుంది. రాట్ వీలర్ రూ.20వేల నుంచి రూ.45వేల వరకు ఉంటుంది. గోల్డెన్ రిట్రీవర్ రూ.25 నుంచి రూ.50వేల, లాబ్రడార్ రూ.20వేల నుంచి రూ.40వేల వరకు, పగ్ రకం రూ.12వేల నుంచి రూ.25వేల వరకు, షిట్ జు రకం రూ.30వేల నుంచి రూ.45వేల వరకు, డచ్షండ్ రకం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు, బీగల్ రకం రూ.15 నుంచి రూ.35వేల వరకు, పమేరినియన్ రకం రూ.10వేల నుంచి రూ.15వేల వరకు, సైబీరియన్ హస్కీ రకం రూ.20వేల నుంచి రూ.80వేల వరకు, చౌచౌ రకం రూ.25-45వేలవరకు, పుట్బుల్ రకం రూ.40-60వేల వరకు, ఇండియన్ స్పిట్జ్ రకం రూ.2వేల-8వేల వరకు, రాజపాలాయం రకం రూ.12వేల – 22వేల వరకు విక్రయిస్తున్నారు.
రూ.50వేలతో పెంపుడు కుక్కకు సర్జరీ
బోధన్, డిసెంబర్ 24: ఆయన పేరు పూదోట రవికిరణ్. బోధన్ పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డులో నివాసం. 20 ఏండ్లుగా వివిధ జాతుల కుక్కలను పెంచారు. ప్రస్తుతం ఆయన వద్ద జర్మన్ షెఫర్డ్, లాబ్రాడర్ అనే రెండు కుక్కలు ఉన్నాయి. రెండేండ్ల కిందట రవికిరణ్ దంపతులు అమెరికా వెళ్లగా, వాటి సంరక్షణను సర్వెంట్స్‌కు అప్పగించారు. ఆ సమయంలో జర్మన్ షెఫర్డ్ కుక్క కాలు విరిగింది. దీంతో జగిత్యాల వెటర్నరీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి సర్జరీ చేయించారు. మూడు నెలలపాటు జరిగిన చికిత్సకు రూ.50వేలకు పైగానే ఖర్చయ్యింది. ఇప్పుడా జర్మన్ షెఫర్డ్ ఎంతో చలాకీగా, ఆరోగ్యంగా యజమాని సేవలో నిమగ్నమై ఉంది.