మోర్తాడ్, జూలై 28: బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటుహక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తహసీల్దార్లకు సూచించారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా తహసీల్ కార్యాలయాలను సందర్శించారు. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ‘సర్’ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లనమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ఏఎస్డీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ముఖ్యంగా నోమ్యాపింగ్, డెత్, డబుల్, షిఫ్టెడ్ కేటగిరిల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని కోరా రు.
నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89శాతం మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకూ తక్కువగా నమోదైన పోలింగ్ బూత్‌ల జాబితాను తహసీల్దార్లకు అందజేశారు. ఆయా బూత్‌ల్లో నమోదు శాతం ఎందుకు తగ్గిందో పరిశీలించి, మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3వ తేదీలోగా ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 2002 నుంచి ఇప్పటి వరకు నోమ్యాపింగ్, పర్మినెంట్ షిప్టెడ్ ఓటర్లు 5శాతానికి మించి ఉన్న పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంకా నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించి బీఎల్ఏలు, బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి వందశాతం ఎన్యూమరేషన్ పూర్తిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఓటరు హక్కు పరిరక్షంచబడాలని, అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అందేలా బీఆర్ఎస్ పార్టీ తరపున నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.