బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 16, 2020 , 00:38:10

పరిశోధనా ఫలితాలు జాతికి అందించాలి

పరిశోధనా ఫలితాలు జాతికి అందించాలి

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీమ్‌

వృక్ష శాస్త్ర విభాగంలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

డిచ్‌పల్లి : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ఫలితాలను తెలుసుకుని ఒకరితో ఒకరు పంచుకుంటూ మానవ మనుగడకు కృషి చేయాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలను టీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీమ్‌ కోరారు. మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం  ‘ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌' అనే అంశంపై ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై  విస్తృతంగా పరిశోధనలు జరిపి వాటి ఫలితాలను జాతికి అందించాలన్నా రు. జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌, డాక్టర్‌ మహతాబ్‌ బాంజి మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల కృషి మరువరానిదన్నారు. అనంతరం అలబామా యూనివర్సిటీ అమెరికాకు చెందిన డాక్టర్‌ బండారి శ్యాంకుమార్‌ మాట్లాడుతూ.. మొక్కల్లో కణ బాహ్య తిత్తులు వ్యాధుల సంక్రమణను అడ్డుకునే విధానం, కరోనా వ్యాధి నివారణలో వాటి ఉపయోగంపై వివరించారు. థాయిలాండ్‌కు చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ పెరుగుతున్న దేశ జనాభాకు సరిపడా అవసరాలను, వివిధ రకాలైన మొక్కల నుంచి మందులను తయారు చేసుకోవడం, ఆయుర్వేద ఔషధాలలో  కల్తీని గుర్తించే పద్ధతులను వివరించారు. తర్వాత నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగాపూర్‌కు చెందిన డాక్టర్‌ హరీశ్‌ హద్రల్‌ మూలకణాల సంకలితం,  ఔషధ రంగంలో వాటి ప్రయోజనాలను వివరించారు. ధావన్గిరి యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ తిప్పస్వామి మాట్లాడుతూ పంట మొక్కల్లో ఆర్టీ-పీసీఆర్‌ విధానంలో అధిక లాభాలను సాధించవచ్చన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఇన్సాఫ్‌ అహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్ల తయారీపై వివరించారు. ఈ సదస్సులో టీయూలోని వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ హలీమ్‌ఖాన్‌, ఆచార్య బి.విద్యావర్ధిని, బీవోఎస్‌ డాక్టర్‌ ఎం.అరుణ, డాక్టర్‌ దేవరాజు శ్రీనివాస్‌, డాక్టర్‌ వి.జలంధర్‌, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. 


logo