ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు టీ సాట్‌లో మాక్‌టెస్టులు అందుబాటులో ఉన్నాయని, ఇవి ఉద్యోగార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయని సీఈవో రాంపురం శైలేశ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాలు అందిస్తున్న టీ సాట్ నెట్వర్క్ ఛానళ్లు యాప్, టీ సాట్. టీవీలో పొందుపరిచిన మాక్‌టెస్టులు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని, ఉద్యోగార్థులు తమ ప్రతిభను తామే నిర్ణయించుకునే అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
టెట్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో 150 ప్రశ్నలతో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుందని శైలేశ్‌రెడ్డి తెలిపారు. 2.30 గంటల సమయంలో 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, సమయం పూర్తయ్యాక యాప్ దానంతటదే క్లోజ్ అవుతుందన్నారు. అభ్యర్థి పూర్తి చేసిన ప్రశ్నలకు వెంటనే మార్కులు డిస్ప్లే అవుతాయని తెలిపారు. ఫలితంగా అభ్యర్థి తన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చన్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో టీ సాట్ ప్రత్యేకంగా నిర్విహించే మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ప్రధాన పరీక్షలోవిజయం సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్టుల్లో సుమారు 25,000 ప్రశ్నలను క్రోడీకరించామని, మరిన్ని ప్రశ్నలను రాబోయే కాలంలో జత చేయనున్నామని వెల్లడించారు. ఇప్పటికే 8000 మంది అభ్యర్థులు మాక్ టెస్ట్ లో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు.
మాక్ టెస్ట్ లో ఎలా పాల్గొనాలంటే?
మాక్ టెస్ట్ లో పాల్గొనే అభ్యర్థి టీ సాట్ యాప్, టీసాట్.టీవీ లోకి ప్రవేశించాక మాక్ టెస్ట్ క్లిక్ చేసి టెట్, పోలీసు కానిస్టేబుల్, పోలీసు ఎస్ఐ అప్షన్లలో తాము రాయబోయే పరీక్షను ఎంచుకోవాలి. అందులో పేరు, విద్యార్హత, ఈ మెయిల్, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. అనంతరం అందులో కనిపించే 150 ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు గుర్తించాలి. 2.30 గంటల సమయం పూర్తయ్యాక తాము సాధించిన మార్పులు తెరపై కన్పిస్తాయి. అభ్యర్థులు పడిన కష్టానికి మాక్ టెస్ట్ ద్వారా ఫలితాన్ని అంచనావేసుకునే అద్భుత అవకాశాన్ని టీ సాట్ కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శైలేశ్‌రెడ్డి కోరారు.