కోర్సు పూర్తిచేస్తే ఆరంభంలోనే రూ.40 వేల జీతం
రెండున్నర ఏండ్లలోనే అత్యుత్తమ హోదా, కార్పొరేట్ కొలువు
కెరీర్‌కు బంగారు బాట వేస్తున్న కంపెనీ సెక్రటరీ కోర్సు
నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఐసీఎస్ఈ
హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ రాజమొగిలి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 : కార్పొరేట్ ఉద్యోగం, మంచి జీతం, హోదా, నేరుగా కంపెనీ డైరెక్టర్లతోనే వ్యవహారాలు.. ఇవన్నీ సాధించాలంటే ఏదైనా ప్రఖ్యాత యూనివర్సిటీలోనో లేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోనో అత్యున్నత చదువులు చదవాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్ తర్వాత కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సులో చేరి, పట్టుదలతో రెండున్నర ఏండ్లు కష్టపడితే చాలు. ప్రతిష్ఠాత్మకమైన ఈ కోర్సును మన హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) సంస్థలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఐసీఎస్ఐ చాప్టర్ చైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అమిరిశెట్టి రాజమొగిలి ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కోర్సు వివరాలను విశదీకరించారు. కంపెనీ సెక్రటరీ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రారంభ దశలోనే నెలకు రూ.40 వేల పైచిలుకు వేతనం లభిస్తుందని, ప్రతిభ ఆధారంగా కొద్దికాలంలోనే రూ.లక్షకుపైగా వేతనాన్ని అందుకోవచ్చని తెలిపారు. ఇంటర్ చదువుతూనే ఈ కోర్సులో చేరవచ్చని, కామర్స్ నేపథ్యం ఉన్నవారే కాకుండా బీటెక్, ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులు సైతం ఈ కోర్సును పూర్తి చేయవచ్చని చెప్పారు. ఇంటర్వ్యూ వివరాలు ఇవీ..
ఈ కోర్సులోనే చేరాల్సిన అవసరమేంటి?
కంపెనీల చట్టం 2013 ప్రకారం.. రూ.10 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీని (సీఎస్) నియమించుకోవాలి. ఇలాంటి కంపెనీలు మన దేశంలో లక్ష వరకూ ఉన్నాయి. కానీ, దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ సీఎస్‌లు కేవలం 60 వేల మందే ఉన్నారు. వీరిలో 50 వేల మంది మాత్రమే సీఎస్‌లుగా పనిచేస్తున్నారు. 10 వేల మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ చాప్టర్ పరిధిలో 2,300 మంది సీఎస్‌లు మాత్రమే ఉన్నారు. సీఎస్ కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాల్లో ఎలాంటి ఢోకా ఉండదని చెప్పవచ్చు. ఐసీఎస్ఈలో సభ్యత్వమున్న వారిని మాత్రమే సీఎస్‌లుగా నియమించుకొనేందుకు వీలుంటుంది. సీఎస్ ప్రొఫెషనల్స్‌ను మా సంస్థ మాత్రమే తయారుచేయగలదు. సీఎస్ కోర్సుకు పీజీ కోర్సులతో సమానంగా యూజీసీ గుర్తింపు ఇచ్చింది.
వేతనాలెలా ఉంటాయి?
కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు రూ.40 వేలవరకు వేతనాలిస్తున్నారు. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్నవారు రూ.10-25 లక్షల వార్షిక వేతనాన్ని పొందుతున్నారు. ఈ రంగంలో కనీసం పదేండ్ల అనుభవం ఉన్నవారు రూ.25-40 లక్షల వార్షిక వేతనాన్ని అందుకోవచ్చు. స్వయంగా నేనే సీఎస్ పూర్తిచేసి ఓయూ, మిధాని, మహిళా, శిశు సంక్షేమశాఖ, టెక్స్టైల్, రైల్వే వంటి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొన్నా. టాటా ప్రాజెక్ట్స్‌లో ఏడాదికి కోటి రూపాయల వేతనానికి పనిచేశా. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాతో కలిసి పనిచేసే అదృష్టం సీఎస్ కోర్సు పూర్తిచేయడం వల్లే కలిగింది.
కోర్సు వివరాలేంటి?
18 ఏండ్లు నిండినవారు సీఎస్ కోర్సులో చేరవచ్చు. ఇంటర్ చదువుతున్నవారు కంపెనీ సెక్రటరీ ఎగ్జిగ్యూటివ్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఎస్ఈఈటీ) ద్వారా సీఎస్‌లో చేరవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది మే 7న జరుగనున్నది. కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు సీఎస్ఈఈటీతో నిమిత్తంలేకుండా నేరుగా సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రాంలో.. పీజీ పూర్తిచేసిన వారైతే నేరుగా సీఎస్ ప్రొఫెషనల్ ప్రొగ్రాంలో చేరవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐదేండ్లల్లో ఈ మూడు ప్రొగ్రాంలను పూర్తిచేయాల్సి ఉంటుంది. కనిష్ఠంగా రెండున్నర ఏండ్లల్లోనే మూడు ప్రోగ్రాంలను, శిక్షణను పూర్తిచేసి కంపెనీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరవచ్చు.
ఫీజులెలా ఉంటాయి?
విద్యార్థి మొదట రూ.1,000 ఫీజు చెల్లించి www.icsi.edu వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీఎస్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రొగ్రాంలను రూ.35 వేలలోపు ఫీజుతో పూర్తిచేయవచ్చు. ఈ కోర్సుల్లో చేరినవారికి పుస్తకాలను ఉచితంగానే ఇస్తాం.
శిక్షణ, తరగతులు ఎలా ఉంటాయి?
కరోనా వల్ల ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులనే నిర్వహిస్తున్నాం. విద్యార్థులే సొంతంగా ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతిలో కోర్సును పూర్తిచేయవచ్చు. క్లాసులకు హాజరయ్యేవారి నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకుంటాం. మూడు ప్రోగ్రాంలను పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు 21 మాసాల శిక్షణను పూర్తిచేయాలి. ప్రాక్టీస్ చేస్తున్న సీఎస్ వద్ద సహాయకులుగా లేదంటే కంపెనీల్లో ప్రొబేషనర్లుగా విధులు నిర్వహించాలి. ఇందుకు కొంత ైస్టెఫండ్ను పొందవచ్చు. ఈ శిక్షణ తర్వాత ఐసీఎస్ఐ నిర్వహించే 30 రోజుల కార్పొరేట్ లీడర్షిప్ ప్రొగ్రాంను పూర్తిచేయగానే ఐసీఎస్ఐ సభ్యత్వం లభిస్తుంది. దీంతో కంపెనీ సెక్రటరీ అయిపోయినట్టే. అభిరుచి మేరకు ఉద్యోగాల్లో చేరవచ్చు. లేదంటే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఎవరిని సంప్రదించాలి?
కోర్సులు, అడ్మిషన్ల కోసం అభ్యర్థులు www.icsi.edu వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లో ఐసీఎస్ఐ సీవోఈ బిల్డింగ్, సర్వే నెంబర్ -1 జెన్‌ప్యాక్ట్ రోడ్, ఐడీఏ ఉప్పల్-500039 అడ్రస్, ఫోన్ నంబర్లు 040 -27177721/24, 28, ఈ-మెయిల్ hyderabad@icsi.edu, icsi.edu. hyderabad వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
తెలంగాణ విద్యార్థుల కోసం
ఏం చేయబోతున్నారు?
ఈ కోర్సును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిలాల్లో స్టడీ సెంటర్లను నెలకొల్పాం. శాతవాహన యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నాం. వీలైనంత ఎక్కువ మంది కంపెనీ సెక్రటరీలను తయారుచేయాలన్నదే మా సంకల్పం.
ఎలాంటి ఉద్యోగాలు, హోదా పొందవచ్చు?
కంపెనీ సెక్రటరీలకు రకరకాల హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు సలహాదారు (అడ్వైజర్)గా, కీ మేనేజీరియల్ పర్సనల్‌గా, కాంప్ల్లియన్స్ ఆఫీసర్‌గా, సెక్రటేరియల్ ఆడిటర్‌గా, కార్పొరేట్ రిస్క్ మేనేజర్‌గా, చీఫ్ గవర్నెన్స్ ఆఫీసర్‌గా, కార్పొరేట్ ప్లానర్ అండ్ స్ట్రాటజిక్ మేనేజర్‌గా, ఇంటర్నల్ ఆడిటర్‌గా, సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రొఫెషనల్‌గా, జీఎస్టీ ప్రొఫెషనల్‌గా, రిజిష్టర్డ్ వాల్యూయర్‌గా, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్‌గా, రిప్రంజేటేషన్ సర్వీస్ ప్రొఫెషనల్‌గా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు. లేదంటే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు.