స్విగ్గీ, జొమాటోల్లో.. బిర్యానీలు, పిజ్జాలు ఆర్డర్ ఇవ్వడం కామన్! గర్ల్‌ఫ్రెండ్స్, పెళ్లికూతురు కావాలంటూ రిక్వెస్ట్ పెట్టడమే వెరైటీ! గతేడాది ఇలాంటి వెరైటీలు ఎన్నో జరిగాయని చెబుతున్నది ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. జొమాటో! 2024లో 4,940 మంది.. తమకు ‘గర్ల్‌ఫ్రెండ్’ను డెలివరీ చేయాలంటూ జొమాటోకు అభ్యర్థనలు పంపారట. మరో 40 మంది ‘పెళ్లికూతురు’ కోసం సెర్చ్ చేశారట. 2024 ముచ్చట్లను పంచుకుంటూ.. జొమాటో ఈ ఫన్నీ విషయాలనూ వెల్లడించింది. దేశంలో ఎన్నో మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్స్ ఉన్నా.. పెళ్లికూతుళ్లు, గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వెతకడంపై జొమాటో ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
2024లో ఫుడ్ డెలివరీకి సంబంధించి ఢిల్లీ – జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్ ) అగ్రస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ప్రాంతం నుంచి అత్యధికంగా 12.4 కోట్ల ఆర్డర్లు అందుకున్నట్టు జొమాటో వెల్లడించింది. ఆ తర్వాత స్థానాలు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ర్టాలు దక్కించున్నాయట. ఈ ప్రాంతాల నుంచి 10.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయట. ఇక బెంగళూరు నగరం 30 లక్షల ఆర్డర్లు ఇచ్చి, ముంబయిని వెనక్కి నెట్టింది. ఒకేరోజు అత్యధిక ఆర్డర్లను పొందింది.. మే 12. జొమాటో ఆ రోజు 34.8 లక్షల ఆర్డర్లను అందుకున్నదట. జనవరి 29న అత్యల్పంగా.. 16.8 లక్షల ఆర్డర్లు వచ్చాయని సదరు సంస్థ చెప్పింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేక్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చింది డిసెంబర్ 25నో.. డిసెంబర్ 31నో కాదట. సెప్టెంబరు 22న వచ్చాయట. అందులోనూ.. ‘అంబానీ పెళ్లి’ అని సేవ్ చేసిన చిరునామాకు నాలుగు ఆర్డర్లు వచ్చాయట.
బిర్యానీయే బాస్.. ఎప్పటిలాగే.. ఎక్కువ ఆర్డర్లు పొందిన ఆహార పదార్థంగా బిర్యానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2024లో అత్యధికంగా 9కోట్ల 10 లక్షల మంది బిర్యానీని ఆర్డర్ చేశారట. ఆ తర్వాత 5 కోట్ల 80 లక్షల ఆర్డర్లతో పిజ్జా రెండో స్థానాన్ని దక్కించుకున్నది. ఇక భారతీయుల ఫేవరెట్ డ్రింక్స్ విషయానికి వస్తే.. టీ, కాఫీలే దక్కించుకున్నాయట. 77.7 లక్షల టీలు, 74.3 లక్షల కాఫీలను జొమాటో డెలివరీ చేసిందట.