అమరావతి : ఏపీలో అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడిలు, పోలీసులు కులం పేరుతో దూషించినందుకు ఓ వైసీపీ(YCP) కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి ( Suicide attempt ) ఒడిగట్టాడు. ప్రస్తుతం అతడు వెంటిలేటర్‌పై కొట్టు మిట్టాడుతున్నాడు. పల్పాడు జిల్లా (Palnadu District ) రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామానికి చెందిన వ్యాపారి , వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గతంలో టీడీపీలో ఉండి ఎన్నికల సమయంలో వైసీపీలోకి మారాడు.
వ్యాపారం చేసుకునే ఆయన మరో ముగ్గురికి మాట సహాయంగా 35 లక్షల వరకు మరో వ్యక్తి వద్ద సరుకులు ఇప్పించాడు. అయితే ఆ ముగ్గురు డబ్బులు ఇవ్వకపోవడంతో లక్ష్మీనారాయణపై పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలు ఒత్తిడిలు పెంచారు. అయితే తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని మొండికేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
స్థానిక డీఎస్పీ వ్యాపారి లక్ష్మీనారాయణను పిలిపించుకుని నువ్వు కమ్మ వాడివి. నీకు ఆపార్టీ ( వైసీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. మానసికంగా కుంగిపోయిన లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో తీసుకుని టీడీపీ నాయకుల ఒత్తిళ్లు, పోలీసుల బెదిరింపులను వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు గుంటూరు ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్‌పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
స్పందించిన వైసీపీ అధినేత..
ఘటన విషయం తెలుసుకున్న మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. వైసీపీ కార్యకర్త ఆత్మహత్యకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందిరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు.