హైదరాబాద్: ప్రపంచ జనాభా దినోత్సవం (World Populatiom Day) ఏటా జూలై 11న నిర్వహిస్తారు. జనాభా పెరుగుదల, తగ్గుదల వల్ల కలిగే లాభనష్టాలను అవగాహన పరిచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1987, జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్ల (5 బిలియన్లు)కు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనాభా పెరుగుదల మానవజాతి మనుగడపై చూపే ప్రభావాల గురించి అవగాహన కల్పించేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది.
1990 నుంచి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజలకు.. చిన్న కుటుంబాలు, సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను వివరించడం, కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం (Gender Eaquality), మానవ హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడం.
యూఎన్డీపీ ప్రతి ప్రపంచ జనాభా దినోత్సవానికి ఒక థీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది థీమ్ ‘రియలైజ్ ది హోప్స్ అండ్ అస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్- టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్’. ప్రస్తుతం ప్రపంచ జనాభా 830 కోట్లకు చేరుకుంది.
యూఎన్ పాపులేషన్ అవార్డు-2026 వ్యక్తిగత విభాగంలో సెనెగల్‌కు చెందిన ప్రొఫెసర్ సెరిగ్నే మాగ్యే గుయేకు, సంస్థాగత విభాగంలో బురుండికి చెందిన ఫౌండేషన్ బాన్ యాక్షన్ ఉముగిరనేజాకు లభించింది. ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1981లో ఏర్పాటు చేసింది.