అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గత వారం 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మరికొన్నిసార్లు పెంపు ఉంటుందనీ ప్రకటించింది. దీంతో కనీస స్థాయిలో ఉన్న వడ్డీరేట్లు ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్ల భారం పెరుగుతుంది. కరోనా దృష్ట్యా గత రెండేండ్లుగా రిజర్వ్ బ్యాంక్ పాలసీ వడ్డీరేట్లను స్థిరంగా 4శాతం దగ్గరే ఉంచుతున్నది. తక్కువ వడ్డీరేట్లను కొనసాగించడం ద్వారా ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం కాగలదని అంచనా వేసింది. అయినప్పటికీ 4శాతం కన్నా తక్కువగా పాలసీ రేట్లను తగ్గించడానికి సాహసించలేదు. దీంతో మన దేశంలో కూడా వడ్డీరేట్లు ఇంతకన్నా కనీస స్థాయికి పతనం కావన్న విషయం స్పష్టమైంది.
రేట్లు పెరిగితే?
వచ్చే నెల ఆర్బీఐ ద్రవ్య సమీక్షలో రెపోరేటును 4 నుంచి 4.1 శాతం లేదా 4.25 శాతానికి పెంచే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీరేట్ల భారం పెరిగి ఈఎంఐలపై ప్రభావం పడుతుంది. అయితే పాలసీ రేట్లకు అనుగుణంగా టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరిగినా.. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెద్దగా పెరగకపోవచ్చు.