e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News డెల్టా కంటే డేంజర్‌

డెల్టా కంటే డేంజర్‌

  • ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ‘బీ.1.1.529’
  • స్పైక్‌ ప్రొటీన్‌లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు
  • 25 ఏండ్లలోపు వారిపైనే ప్రభావం ఎక్కువ
  • భారత్‌లో వేరియంట్‌ ఉనికి లేదు: ఇన్సాకాగ్‌

ఆధునిక ప్రపంచంలో ఎన్నడూ చూడనటువంటి మహా ఉత్పాతాన్ని సృష్టించిన కరోనా మహమ్మారి చేసిన గాయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు. వైరస్‌ ఉద్ధృతి తగ్గి పరిస్థితులు కుదుట పడుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే మరో పిడుగులాంటి వార్త. దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన ‘బీ.1.1.529’ వేరియంట్‌ శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నది. ఇంతవరకూ చూడనటువంటి తీవ్రమైన వేరియంట్‌గా చెబుతున్న ఈ కొత్త రకం ఎక్కడ నుంచి వచ్చింది? ప్రభావమెంత? వ్యాక్సిన్లకు లొంగుతుందా?

ఏమిటీ వేరియంట్‌?

గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికాలో రోజూవారీ సగటు కేసులు 200కుపైగా నమోదవుతున్నాయి. అయితే, గత బుధవారం ఒక్కరోజునే 1,200 కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు దానికి రెట్టింపు అంటే 2,465 కేసులు రికార్డయ్యాయి. మరణాలు కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వారు కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అదే ‘బీ.1.1.529’. దక్షిణాఫ్రికా దేశం బోత్సువానాలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ రోగిలో ఈ వేరియంట్‌ ఉత్పన్నమై ఉండొచ్చని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లోని జెనటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఫ్రాన్‌కోసిస్‌ బాలౌక్స్‌ అభిప్రాయపడ్డారు.

డెల్టా కంటే ప్రమాదకరమైనదా?

- Advertisement -

సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లో ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లలోని స్పైక్‌ ప్రొటీన్లలో శాస్త్రవేత్తలు రెండు, మూడు ఉత్పరివర్తనాలే ప్రమాదకరమైనవిగా గుర్తించారు. అయితే తాజాగా గుర్తించిన ‘బీ.1.1.529’ వేరియంట్‌లో 50కి పైగా ఉత్పరివర్తనాలను కనుగొన్నారు. ఇందులో 30కి పైగా ఉత్పరివర్తనాలు వైరస్‌ కొమ్ములోనే గుర్తించడం గమనార్హం. మనిషి కణాల్లోకి ప్రవేశించాలంటే స్పైక్‌ ప్రొటీనే కీలకం. అక్కడే 30కి పైగా ఉత్పరివర్తనాలు జరుగడంతో ఈ వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది.

వ్యాక్సిన్లు పనిచేయగలవా?

కరోనా వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై ఏ మేరకు సమర్థవంతంగా పనిచేస్తాయన్న విషయాన్ని ప్రస్తుతం చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ శాస్త్రవేత్త షారన్‌ పికాక్‌ తెలిపారు. వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో కనుగొన్న 30 మ్యుటేషన్లలో కొన్నింటి వివరాలు ఇంకా తమకు తెలియాల్సి ఉన్నదన్నారు. దీనిపై పరిశోధనలు చేయడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందన్నారు. గతంలో వైరస్‌ బారిన పడి కోలుకున్న వారితోపాటు, వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి కూడా ఈ వేరియంట్‌ సులభంగా సోకొచ్చని బాలౌక్స్‌ పేర్కొన్నారు.

కొత్త వేరియంట్‌ ఉనికి నేపథ్యంలో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది. ఆఫ్రికాలోని ఆరు దేశాలకు ప్రయాణాలను నిషేధిస్తున్నట్టు బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, బెల్జియం, మాల్టా, చెక్‌ రిపబ్లిక్‌, జపాన్‌ వెల్లడించాయి. ఇప్పటివరకైతే భారత్‌లోకి కొత్త వేరియంట్‌ ప్రవేశించలేదని ఇన్సాకాగ్‌ తెలిపింది. ‘బీ.1.1.529’ వేరియంట్‌ తీవ్రత, వ్యాప్తిరేటు, వ్యాక్సిన్లపై ప్రభావం తదితర అంశాలను చర్చించేందుకు డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం సమావేశమైంది.

ఒమిక్రాన్‌గా నామకరణం

బీ.1.1.5.2.9
వేరియంట్‌కు డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్‌గా నామకరణం చేసింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా
ప్రకటించింది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement