కాజీపేట, జూన్ 19: గుడిసెవాసులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, పేదలకు బీఆర్ఎస్ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని కాజీపేట పట్టణం 62వ డివిజన్లోని రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నగర్లో సుమారు ముడున్నర దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలు తమ సమస్యలను వినయ్‌భాస్కర్‌కు వివరించారు.
ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు గుడిసెలను ఖాళీ చేయాలని మాపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతూ మమ్ములను మీరే కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నగరంలోని ఏ వర్గానికి హాని చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ స్వాగతిస్తుందన్నారు. ‘ నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను, ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఇబ్బందులు తెలుసు.. మీలో కుటుంబ సభ్యుడిగా మీకు తోడుగా ఉంటాను’ అని అన్నారు. గతంలో తాను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ కోసం స్థలం ఇప్పిస్తామని మాట ఇచ్చామని, దీని ప్రకారం పట్టణంలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేశానని గుర్తు చేశారు. భద్రకాళీ ఆలయ అభివృద్ధి పనులకు గత సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.30 కోట్ల నిధులు తెచ్చామని వివరించారు.
భద్రకాళీ ఆలయ మాఢ విధుల నిర్మాణం కోసం చెరబండ రాజు కాలనీ వాసుల గుడిసెలను తొలగించమని మేము చెప్పలేదన్నారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే చెరబండ రాజు కాలనీ వాసులకు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. తన 20 ఏండ్ల ప్రజా జీవితంలో పేదల గుడిసెలను కూల్చలేదని, పేద ప్రజల జోలికి ఎవ్వరినీ రానివ్వలేదన్నారు. తనపై అసత్య ప్రచారాలు, అవినీతి ఆరోపణలు చేసిన వారే ఎన్ఐటీ పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేశారన్నారు. అభివృద్ధి పేరుతో ఏ వర్గానికి హానీ చేయకూడదని, హానీ చేయని అభివృద్ధిని స్వాగతిస్తామన్నారు. కాజీపేటలో తన హయాంలో ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేశామని, మరి ఇప్పుడు ఆ కళాశాల ఎక్కడికి పోయిందని సర్కారును ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల కోసం మాజీ కార్పొరేటర్ సదానందం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు నివసిస్తున్న భూమి ప్రభుత్వ భూమి అయితే సర్కారు దవాఖాన, తహసీల్దార్, ఏసీపీ తదితర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడంతో పాటు అక్కడ గుడిసెలు వేసుకున్న పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పాలకులు విలువైన భూములను ఫ్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ప్రశ్నించే , పోరాడే తనపై కేసులు పెడుతున్నారని, నాకు కేసులు కొత్తకాదన్నారు. కోర్టులను గౌరవిస్తూనే ప్రజా సమస్యలను పరిష్కరించే వరకూ ప్రజలతో కలిసి పోరాడుతానని తెలిపారు. వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సాంబమూర్తి, కృష్ణమూర్తి, లింగమూర్తి, కేవీ రావు, ఐలయ్య, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, శిరుమల్ల దశరథం, గబ్బెట శ్రీనివాస్, శివకుమార్, మర్యాల కృష్ణ, తేలు సారంగపాణి, మిట్టపల్లి రవీందర్, పాము రాజేశ్, దువ్వ కనకరాజు, అఫ్జల్, రామస్వామి, హుస్సేన్, రంజిత్, వేణు, రఘు, మహమూద్, మల్లేశ్, పావణి పాల్గొన్నారు.