అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా కంటే ముందు విడుదల కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో సినిమా విడుదలను అప్పట్లో నిర్మాతలు వాయిదా వేశారు.
హాలీవుడ్‌కి చెందిన వీఎఫ్ఎక్స్ నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. ఇప్పుడు ‘విశ్వంభర’ అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. అయినా సరైన విడుదల తేదీ కోసం మేకర్స్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. చిరంజీవి, బాబీ కొల్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కాకా’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత వెంకట్ కె.నారాయణ ఇప్పటికే ప్రకటించారు.
దాంతో రానున్న సంక్రాంతికి కూడా ‘విశ్వంభర’ లేనట్టు తేలిపోయింది. మరి ‘విశ్వంభర’ విడుదల ఎప్పుడు? ఈ ప్రశ్న సమాధానంగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తున్నది. 2027 శివరాత్రి కానుకగా ‘విశ్వంభర’ను విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ భావిస్తున్నదట. అంటే.. వచ్చే ఏడాది రెండు నెలల గ్యాప్‌తో మెగాస్టార్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయన్నమాట. ఇది మెగా అభిమానులకు నిజంగా శుభవార్తే.