మధురై : ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుకతో తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లా తిరుతంగల్ కు చెందిన 20 ఏండ్ల ఇంజనీరింగ్ విద్యార్ధి వరల్డ్ రికార్డు నమోదు చేసేందుకు కొద్ది అడుగుల దూరంలో నిలిచాడు. 10.8 సెంటీమీటర్ల పొడవైన నాలుకతో బీఈ రోబోటిక్స్ చదువుతున్న ప్రవీణ్ గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకోనున్నాడు. ఇప్పటివరకూ 10.1 సెంటీమీటర్ల పొడవైన నాలుక కలిగి ఉన్న వ్యక్తి పేరిట గిన్నీస్ రికార్డు నమోదైంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ప్రవీణ్ నాలుక 10.8 సెంటీమీటర్లని వెల్లడైంది.
గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రవీణ్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డులకెక్కాడు. తన నాలుకతో నిమిషానికి 219 సార్లు ముక్కును తాకినందుకు ఈ అరుదైన రికార్డు ప్రవీణ్ పరమైంది. గిన్నీస్ బుక్ లోకి ఎక్కేందుకు డబ్బు అవసరమని ప్రస్తుతం తాను నిధులను సమీకరిస్తున్నానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. తన పొడవాటి నాలుకతో ఇబ్బందులేమీ లేవని తాను దీన్ని డ్రాయింగ్ వేసేందుకు, రాసేందుకు బ్రష్ లా వాడతానని పేర్కొన్నారు.