Vijaya Reddy | ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపపోరు(Khairatabad by-election) నగర రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నది. ఈ క్రమంలో ఉప ఎన్నికపై దివంగత పీజేఆర్ కూతరు విజయా రెడ్డి(Vijaya Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్ పేరు లేనిది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు వెళ్లదని స్పష్టం చేశారు. పీజేఆర్ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు పంపి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆమె కుండబద్ధలు కొట్టడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఈదఫా తనదే టికెట్ అనే ధీమాలో ఉన్న ఆమె ఈ మేరకు ఆమె ఇప్పటికే అనుచరులకు సంకేతాలివ్వడంతో క్షేత్రస్థాయిలో వారంతా హడావిడి మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు.. ఆయన నిలకడ లేని మనిషి అందుకే దానం నాగేందర్ కంటే కాంగ్రెస్ పార్టీకి విజయా రెడ్డినే సరైన అభ్యర్థి అని గతంలో కాంగ్రెస్ నాయకుడు నుమాన్ మహమ్మద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరోవైపు ఇటీవల పార్టీ ఫిరాయింపు వేటుపడి పదవిని కోల్పోయిన దానం నాగేందర్ మాత్రం ధీమాగా తనకే టికెట్ అని చెప్పుకునే పరిస్థితి లేకపోవడం ఆయన అనుచరుల్ని అయోమయానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా ఉపపోరు బరిలో నిలువకుంటే ప్రత్యక్ష రాజకీయాలే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా… పోరులో నిలిస్తే కీలకమైన విజయారెడ్డి వర్గం సహకరించేలా లేకపోవడంతో దానం పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైందని ఆయన అనుచరులే వాపోతున్నారు. ఈసారి గెలుపు కష్టమేనని ఆ పార్టీ తలలు పట్టుకోవడం కొసమెరుపు.