న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రీపెయిడ్ కస్టమర్ల మొబైల్ రిచార్జ్ ప్లాన్ల ధరలను 18-25 శాతం మేర వొడాఫోన్ ఐడియా పెంచింది. సోమవారం భారతీ ఎయిర్టెల్ పెంచిన నేపథ్యంలో మంగళవారం వొడాఫోన్ ఐడియా సైతం వివిధ కాలపరిమితులతో కూడిన వాయిస్ కాల్స్, డాటా ప్యాకేజీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, నానాటికీ కస్టమర్లను కోల్పోతున్నప్పటికీ వొడాఫోన్ ఐడియా చార్జీల పెంపునకే మొగ్గు చూపింది. ఇప్పటికే సంస్థ పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే రిలయన్స్ జియో కూడా తమ టారీఫ్లను పెంచవచ్చన్న అంచనాలు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్నాయి.