అలనాటి ప్రఖ్యాత నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత, బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి(102) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరని దేదీప్యమానం చేసిన నటీమణుల్లో కృష్ణవేణి ఒకరు. 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ కుగ్రామంలో కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వృత్తి రీత్యా వైద్యులు. చిన్నతనం నుంచి కృష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా కెరీర్ ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుంచి కృష్ణవేణిలో తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారితో తాను సాగిపోయారు. 1936లో వచ్చిన ‘సతీ అనసూయ’తో బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. మోహినీ రుక్మాంగద, కచదేవయాని, మళ్లీ పెళ్లి చిత్రాలు కృష్ణవేణికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
1939లో నూజివీడు సంస్థానాధిపతి మీర్జాపూరం జమీందార్ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. 1941లో తన భర్తతో కలిసి ‘శోభానాచల పిక్చర్స్’ అనే చిత్రరంగ సంస్థని స్థాపించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా అవతరించారు కృష్ణవేణి. ఆ సంస్థలో ఆమె నిర్మించిన తొలి సినిమా ‘ధక్షయజ్ఞం’(1941). తన సొంత బ్యానర్లో ఆమె నటించిన ‘గొల్లభామ’(1947) కృష్ణవేణిని స్టార్ హీరోయిన్ని చేసింది. ఈలపాట రఘరామయ్య కథానాయకుడిగా వచ్చిన ఆ సినిమా ద్వారానే మహానటి అంజలీదేవి చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇక శోభనాచల స్టూడియోస్ నిర్మించిన మరో క్లాసిక్ ‘కీలుగుర్రం’(1949). ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, అక్కినేనిని మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక కృష్ణవేణి జీవితంలో మరపురాని చిత్రం ‘మనదేశం’(1949). ఆ సినిమా ద్వారానే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారకరామారావు వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన పోలీసాఫీసర్‌గా చిన్న పాత్ర చేశారు.
దేశం గర్వించదగ్గ ఆ మహానటుడ్ని వెండితెరకు పరిచయం చేసి, చరిత్రలో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు కృష్ణవేణి. గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకునిగా పరిచయమైంది కూడా ‘మనదేశం’ సినిమాతోనే కావడం మరో విశేషం. ఈ సినిమా ద్వారానే పి.లీల గాయనిగా పరిచయమయ్యారు. ఆ విధంగా తెలుగు సినిమా లెజెండ్స్ ఎన్టీఆర్, ఘంటసాల, అంజలీదేవి, గాయని పి.లీల.. వీరందరికీ తొలి అవకాశాలిచ్చి ప్రోత్సహించారు కృష్ణవేణి. అక్కినేని ‘శ్రీలక్ష్మమ్మకథ’, కృష్ణవేణి టైటిల్ పాత్రతో వచ్చిన ‘లక్ష్మమ్మ’ ఈ రెండు సినిమాలు.. 1950లో ఒకేసారి విడుదలయ్యాయి. వీటి కథ కూడా ఒకటే. అయితే.. అక్కినేని ‘శ్రీలక్ష్మమ్మ కథ’ పరాజయం చవిచూడగా, కృష్ణవేణి ‘లక్ష్మమ్మ’ విజయాన్ని సాధించింది. అలాగే భీష్మ(1944), మదాలస(1948), పేరంటాళ్లు(1951) తదితర చిత్రాల్లో కూడా కృష్ణవేణి నటించారు.
ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారిలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఉన్నారు.
నాన్నగారి నట జీవితానికి తొలి అవకాశమిచ్చిన కృష్ణవేణిగారి మృతి బాధాకరం. తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు.. నటించారు. ఆమె మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. కృష్ణవేణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
నటి, నిర్మాత, నేపథ్య గాయనిగా కృష్ణవేణి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్‌ని తెలుగు తెరకు కానుకగా ఇచ్చారు. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తూన్నా..