Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోయే ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 2027 సమ్మర్లో విడుదల చేస్తామని రాజమౌళి అధికారికంగా వెల్లడించగా, తాజాగా ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ దాదాపుగా ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 2027 ఏప్రిల్ 9న ‘వారణాసి’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీరామ నవమి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే సినిమాకు మరింత ఆధ్యాత్మిక బలం చేకూరుతుందని టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ‘రామాయణం’లోని ఒక కీలక ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. ఇందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన ‘రుద్ర’ అవతారంలో దర్శనమివ్వగా, ఆ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కేవలం టైటిల్ గ్లింప్స్‌తోనే అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లు రిలీజ్‌కు రెండేళ్ల ముందే ఇంటర్నేషనల్ లెవల్లో మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్ టీజర్‌ను పారిస్‌లోని ప్రతిష్టాత్మక ‘లే గ్రాండ్ రెక్స్’ థియేటర్లో ప్రదర్శించనున్నారు. జనవరి 5న రాత్రి 9 గంటలకు బిగ్ స్క్రీన్‌పై ప్రత్యేక ఫార్మాట్లో గ్లింప్స్ ప్రదర్శన జరగనుంది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ‘వారణాసి’ చరిత్రలో నిలవనుంది. గ్లింప్స్‌ను బట్టి చూస్తే, సృష్టి ఆవిర్భావం నుంచి వారణాసి నగర ప్రాధాన్యత, యజ్ఞ యాగాలు, గుహలు, మణికర్ణిక ఘాట్, చినమస్తా దేవి ఉగ్రరూపం వంటి అంశాలు కథలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రామాయణంలోని ఒక ప్రధాన ఘట్టాన్ని కథలో మిళితం చేస్తూ, మహేష్ బాబు రుద్రుడిగా, రాముడిగా ద్వంద్వ అవతారాల్లో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ఆస్కార్ విజేత కీరవాణి అందిస్తుండగా, సినిమాలో ఆరు పాటలు ఉంటాయని ఇప్పటికే వెల్లడించారు.