అహ్మదాబాద్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) తన బ్యాటింగ్ శైలితో ఐపీఎల్లో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో అతన్ని అనేక అవార్డులు వరించాయి. టోర్నీ ఆరంభం నుంచి తన బ్యాటింగ్ తీరుతో థ్రిల్ పుట్టించిన వైభవ్.. సుమారు రెండున్నర కోట్లకు పైగా ఆర్జించాడు. మ్యాచ్ ఫీజులు, క్యాష్ ప్రైజ్‌లు అన్నీ కలిపి అతని ఆదాయం 2.50 కోట్లు దాటేసింది. ఐపీఎల్ 2026లో రాజస్థానీ బ్యాటర్ సూర్యవంశీ 776 రన్స్ స్కోరు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ అతన్ని 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో వేలంలో అతన్ని ఆర్ఆర్ జట్టు సొంతం చేసుకున్నది. అయితే ఈ ఏడాది అతన్ని రిటేన్ చేసుకున్నది.
ఈ యేటి ఫైనల్‌కు రాజస్థాన్ క్యాలిఫై కాలేదు. కానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను వైభవ్ వీక్షించాడు. ఆ తర్వాత ప్రజెంటేషన్ సెర్మనీలో అతను పాల్గొన్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు అతన్ని వరించింది. దీంతో పాటు అతను అనేక అవార్డులు గెలుచుకున్నాడు. వాటితో పాటు క్యాష్ రివార్డులు కూడా అందుకున్నాడు.
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్- రూ.15 లక్షలు,
ఆరెంజ్ క్యాప్-10 లక్షలు,
సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్-10 లక్షలు(దీంతో పాటు టాటా సియారా కారు),
సూపర్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్- రూ.10 లక్షలు(72 సిక్సర్లు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్‌ద సీజన్-10 లక్షలు
ఆర్ఆర్ జట్టు అతన్ని రిటేన్ చేసుకోవడం వల్ల 1.10 కోట్లు, ఆ తర్వాత క్యాష్ రివార్డులు అతన్ని వరిస్తాయి. ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతనికి 7.5 లక్షల మ్యాచ్ ఫీజు ముట్టుతుంది. వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. అంటే 1.20 కోట్లు అతను మ్యాచ్ ఫీజు రూపంలో ఆర్జించాడు. ఆ టీనేజీ క్రికెటర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ఇతర అవార్డులు అందాయి. ఎలక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద మ్యాచ్ లేదా మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ద మ్యాచ్ కేటగిరీలోనూ అతను పలు మార్లు లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఈ సీజన్లో సూర్యవంశీ మొత్తం 2.50 కోట్లపైనే ఆర్జించినట్లు తెలుస్తోంది.