– టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి
హనుమకొండ చౌరస్తా, జూన్ 13 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను అన్ని విధాలా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వెంటనే మరింత చొరవ చూపాలని, ముఖ్యంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతమే ధ్యేయంగా అక్కడ చదివే పేద విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి నాణ్యమైన ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని కళాశాల విద్యా జేఏసీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం(టీజీసీజీటీఏ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాడూరు సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. డిగ్రీ అధ్యాపకుల సుదీర్ఘకాల ప్రయోజనాలకు సంబంధించిన జీవో 21ను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి శనివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆధునిక డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, మౌళిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
అధ్యాపకులకు సకాలంలో ప్రమోషన్లు (సీఏఎస్), ఫిట్ మెంట్ ఫార్ములా, పెండింగ్ ప్రయోజనాలను కల్పిస్తూ వారి నైతిక విలువలని, పనితీరుని మరింత ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాస్, టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు గోపి, ఉపాధ్యక్షుడు జె.చిన్నా, జనరల్ సెక్రటరీ జి.శ్రీనివాస్, యూనివర్సిటీ కోఆర్డినేటర్ డి.రామకృష్ణారెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బి.వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్, వెంకటరమణ, ఎండి.యాకుబ్, వెంకన్న, ఏ.అనిల్‌కుమార్, ఎస్.శ్యాంప్రసాద్, నర్సంపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మల్లేశం, కేడీసీ అధ్యాపకుడు మాదారపు రవికుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిగ్రీ కాలేజీల అధ్యాపకులు పాల్గొన్నారు.