Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సలో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్టులు, డ్యుయల్ జీఐపీ, జీఎల్పీ-1 అగోనిస్టులు వంటి ఆధునిక ఔషధాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఆకలిని తగ్గించి, గణనీయంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
Weight Loss Medicine | బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సలో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్టులు, డ్యుయల్ జీఐపీ, జీఎల్పీ-1 అగోనిస్టులు వంటి ఆధునిక ఔషధాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఆకలిని తగ్గించి, గణనీయంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఎంపిక చేసిన రోగుల్లో గుండె, మూత్రపిండాల సమస్యల ముప్పును కూడా తగ్గించవచ్చు. అయితే ఈ ఇంజెక్షన్లు అందరికీ సరిపోవు. వీటిని సూచించే ముందు వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తారు. కేవలం బరువు తగ్గాలనే కోరికతో ఈ మందులు వాడకూడదని, ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలను బట్టి చికిత్స నిర్ణయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తక్కువగా ఉన్నా టైప్ 2 డయాబెటిస్..
ముందుగా వ్యక్తి ఎత్తు, వయసుకు అనుగుణంగా బరువు, శరీర ద్రవ్యరాశి సూచీ (బీఎంఐ), శరీరంలో కొవ్వు పంపిణీని పరిశీలిస్తారు. భారతీయుల్లో కొందరికి బీఎంఐ సాధారణంగా ఉన్నప్పటికీ అంతర్గత అవయవాల చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోయి టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బరువుతోపాటు శరీరంలో కొవ్వు స్థాయిలను కూడా అంచనా వేస్తారు. వయసును బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. వృద్ధుల్లో అధిక బరువు తగ్గడం, కండరాలు క్షీణించడం, నీరసం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మధుమేహం తీవ్రతను తెలుసుకునేందుకు హెచ్‌బీఏ1సీ, ఉపవాస రక్తంలో చక్కెర, భోజనం తర్వాత చక్కెర స్థాయిలు, వ్యాధి వ్యవధి, ప్రస్తుతం వాడుతున్న మందులను పరిశీలిస్తారు. జీవనశైలి మార్పులు, ట్యాబ్లెట్లను వాడినా చక్కెర నియంత్రణలో లేనివారికి ఈ ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. కొందరికి మెట్ఫార్మిన్ వంటి సాధారణ మందులే సరైన చికిత్సగా కొనసాగుతాయి.
ఎవరు ఈ మందులను వాడకూడదు..?
రోగికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకుంటారు. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఈ మందుల వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొన్ని జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇవి సరిపోవు. రక్తపోటు, కొలెస్ట్రాల్, నడుము చుట్టుకొలత, ఇన్సులిన్ నిరోధకత, గుండె సంబంధిత ముప్పును కూడా అంచనా వేస్తారు. సన్నగా కనిపించినప్పటికీ అంతర్గతంగా అధిక కొవ్వు కలిగిన వారిలో బరువు కంటే జీవక్రియ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
జీవనశైలి కూడా ముఖ్యమే..
ఈ ఇంజెక్షన్లు మాత్రమే వాడితే బరువు తగ్గుతుందని భావించకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత ప్రోటీన్, క్రమం తప్పని వ్యాయామం, నాణ్యమైన నిద్ర, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. చికిత్స సమయంలో వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించాలి. ఈ మందుల వల్ల వికారం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, కండరాల క్షీణత వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. అరుదుగా పిత్తాశయ సమస్యలు, క్లోమగ్రంథి వాపు, శరీరంలో నీరు తగ్గడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇప్పటికే తక్కువ బరువు ఉన్నవారు లేదా తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని వాడకూడదని వైద్యులు సూచించే అవకాశం ఉంది. అందువల్ల వయసు, బీఎంఐ, మధుమేహ తీవ్రత, ఇతర అనారోగ్యాలు, జీవనశైలి, దుష్ప్రభావాల ముప్పును పరిశీలించిన తర్వాతే నిపుణుల పర్యవేక్షణలో ఈ ఇంజెక్షన్లు వాడాలి. సామాజిక మాధ్యమాల్లో చూసి సొంతంగా మందులు వాడడం ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

